తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు : కలెక్టర్​ ముజమ్మిల్​ఖాన్​ 

తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు : కలెక్టర్​ ముజమ్మిల్​ఖాన్​ 
  • ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆకస్మికంగా తనిఖీ 

ఖమ్మం రూరల్, వెలుగు :  తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టొద్దని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం గుదిమళ్లలో ప్యాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -రైతులు ఆందోళన చెందవద్దని, పండించిన నాణ్యమైన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వ మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందని తెలిపారు.

కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశామని, ధాన్యం నాణ్యత ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎఫ్ఏక్యూ ప్రమాణాలు రాగానే కొనుగోలు చేస్తామని చెప్పారు. అవసరమైన మేర లారీలు, గన్ని బ్యాగులు, టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉంచామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఓపీఎంఎస్ లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు.

పారదర్శకంగాలబ్ధిదారుల ఎంపిక

ఖమ్మం టౌన్ :  రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్దిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు.  రాజీవ్ యువ వికాసంపై కలెక్టరేట్ లో స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తో కలిసి సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. దరఖాస్తుల ధ్రువీకరణ 90 శాతం పైగా పూర్తయిందన్నారు. బ్యాంకర్ల చేత లింకేజీ రుణాలు మంజూరు చేసుకొని, జూన్ 2 నుంచి యూనిట్ల గ్రౌండింగ్ పై శ్రద్ద పెట్టాలని సూచించారు. ప్రతీ మండలంలో వివిధ విభాగాలకు కేటాయించిన యూనిట్ల  మేరకు లబ్ధిదారుల జాబితా తయారు చేయాలని చెప్పారు. 

అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు

పైలెట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతి, ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికపై అడిషనల్​ కలెక్టర్​ శ్రీజతో కలిసి కలెక్టర్​ సమీక్షించారు. పైలెట్ గ్రామాల్లో 878 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే, 409 ఇండ్లు బేస్​మెంట్ స్థాయి వరకు నిర్మించామన్నారు.మిగతా 370 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మొదటి విడత రూ. లక్ష ఆర్థిక సహాయం విడుదల చేసిందని తెలిపారు.    

14 మంది అసిస్టెంట్ ఇంజినీర్లకు మండలాల కేటాయింపు 

హౌజింగ్ శాఖను బలోపేతం చేస్తూ ఔట్ సోర్సింగ్ పద్ధతిన ఖమ్మం జిల్లాకు ప్రభుత్వం కేటాయించిన 14 మంది అసిస్టెంట్ ఇంజినీర్లకు మండలాల కేటాయింపు చేస్తూ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మరింత  సమర్థవంతంగా అమలు చేసేందుకు అసిస్టెంట్ ఇంజనీర్లను కేటాయించిందని కలెక్టర్ తెలిపారు. 

కార్బైడ్ రహిత మామిడి పండ్లనే కొనాలి

ఖమ్మం సిటీలోని రోటరీ నగర్ లో ఏర్పాటు చేసిన కార్బైడ్​రహిత మామిడి పండ్ల మార్కెట్ ను వినియోగదారులు, రైతులు ఉపయోగించుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. రోటరీనగర్ లోని  కార్బైడ్ రహిత మామిడి పండ్ల మార్కెట్ ను ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. కాగా, ఇక్కడ ఈ సౌకర్యం కల్పించినందుకు రైతులు కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు.