
- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్,వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కేటాయించిన విధులను సమర్థంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఎన్నికల ప్రక్రియ నిర్వహణపై ఎన్నికల నోడల్ అధికారులతో కలెక్టర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అధికారులు పొరపాట్లకు తావు లేకుండా సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, మ్యాన్ పవర్, బ్యాలెట్ పేపర్లు, బాక్సుల రవాణా, శిక్షణ, సామగ్రి నిర్వహణ, ఖర్చుల పరిశీలన, -పోస్టల్ బ్యాలెట్, మీడియా కమ్యూనికేషన్, హెల్ప్ లైన్, ఫిర్యాదులు-పరిష్కారాలు, ఓటర్ స్లిప్పుల పంపిణీ, నివేదికలు, వెబ్ కాస్టింగ్, ఫలితాల పర్యవేక్షణకు నోడల్ అధికారులను నియమించామన్నారు. అనంతరం మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా కలెక్టర్ వాల్మీకి ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో శ్రీనివాస్, డీపీవో జగదీశ్వర్, బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాశ్, ఏవో సుధాకర్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మహిళా ఆటో డ్రైవర్లు ఆదర్శంగా నిలవాలి
మహిళా ఆటో డ్రైవర్లు ఆర్థిక సాధికారత సాధించి తోటి మహిళలకు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. దుర్గాబాయి దేశ్ముఖ్, మహిళా, శిశు వికాస కేంద్రంలో ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్ లో శిక్షణ పొంది ఉపాధి పొందుతున్న మహిళలతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు విభిన్న రంగాల్లో రాణించాలని, స్వయం ఉపాధి పొందుతూ ఆర్థిక సాధికారత సాధించాలన్న ఉద్దేశంతో ఆటో డ్రైవింగ్ లో ఉచితంగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.
అనంతరం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మానకొండూర్ మండలం చెంజర్లకు చెందిన పిల్లలు లేని దంపతులు వారి రక్తసంబంధీకుల నుంచి చట్టబద్ధమైన దత్తత తీసుకున్నారు. ఈ మేరకు కలెక్టర్ చేతులమీదుగా దత్తత ఉత్తర్వులను అందుకున్నారు.