ఝరాసంగం, వెలుగు: సేంద్రియ పద్దతిలో సాగు చేసిన పంటల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం ఝరాసంగం మండల పరిధిలోని బిడకన్నె గ్రామ శివారులో గల అరణ్య శాశ్వత వ్యవసాయ కేంద్రంలో కృషి సఖీ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్మాట్లాడుతూ..గ్రామాల్లో ఉన్న అంగన్వాడీ, ప్రభుత్వ బడుల ఆవరణలో ఖాళీ స్థలం ఉంటే అక్కడ గార్డెన్ ఏర్పాటు చేసి సేంద్రియ పద్దతిలో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయాలన్నారు.
సేంద్రియ సాగుతో పర్యావరణ పరిరక్షణతో పాటు భూసారం నశించకుండా కాపాడవచ్చన్నారు. ఐదు రోజుల పాటు శిక్షణ పొందిన కృషి సఖిలు గ్రామాల్లో సంప్రదాయ పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. అరణ్య ఆధ్వర్యంలో మహిళా రైతులు పండిస్తున్న పంటలకు మార్కెటింగ్‌తో పాటు రవాణా కోసం సబ్సిడీపై వాహనాలు అందించాలని మహిళా సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. శిక్షణ పూర్తి చేసిన కృషి సఖిలకు కలెక్టర్ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో డీఏవో శివప్రసాద్, అధికారులు శ్రీదేవి, ప్రేమలత, దేవ్‌జా, భిక్షపతి, పద్మ, స్నేహ, మహిళలు పాల్గొన్నారు.
కంకోల్ హైస్కూల్ ను తనిఖీ చేసిన కలెక్టర్రాయికోడ్:
మునిపల్లి మండలంలోని కంకోల్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులు, టీచర్ల హాజరు నమోదును పరిశీలించారు. మనబడి కార్యక్రమం కింద నిర్మించిన మధ్యాహ్న భోజన షెడ్, కిచెన్‌ను పరిశీలించారు. నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని టీచర్లను ఆదేశించారు. పదో తరగతి విద్యార్థుల హాజరు శాతం పెంచి శత శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, స్పెషల్ఆఫీసర్ రామాచారి, హెచ్ఎం తుకారాం, టీచర్లు ఉన్నారు.
