శివ్వంపేట, వెలుగు: బాల్య వివాహాలు చేస్తే జైలుకు వెళ్తారని కలెక్టర్ రాహుల్ రాజ్హెచ్చరించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన చట్టం, బాలల సంరక్షణ పైన శుక్రవారం అంగన్వాడీ, ఆశా వర్కర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ బాల్య వివాహాలు చేస్తే తల్లిదండ్రులకు, పెళ్లి చేసిన పూజారి, సహకరించిన పెద్దలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు.
బాల్యవివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్, పంచాయతీ కార్యదర్శిపై ఉందన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే వీరిని కూడా బాధ్యులు చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. పిల్లలు స్కూల్ కి వెళ్లకుండా పనులకి వెళ్తే తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పాఠశాలలో చదువుకునే విధంగా చూడాలన్నారు.
మాతృ మరణాలు జరగకుండా పోషకాహారం, సరైన వైద్యం అందించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మైపాల్ రెడ్డి, తహసీల్దార్ కమలాద్రి, ఎంపీడీవో వెంకటలక్ష్మి, డీడబ్ల్యూఓ హేమభార్గవి, సూపర్వైజర్ సంతోష, ఐకేపీ ఏపీఎం పెంటా గౌడ్, సీసీ సరిత, బాలల సంరక్షణ అధికారి శంకర్ పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రం పరిశీలన..
మండల కేంద్రంలో సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా మాయిశ్చర్ రాగానే ధాన్యం కొనుగోలు చేసి వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
