రైతులకు ఇబ్బంది రానీయొద్దు : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

రైతులకు ఇబ్బంది రానీయొద్దు : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

జనగామ అర్బన్/ రఘునాథపల్లి, వెలుగు: ప్రతి సీజన్​లో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, నిన్న కురిసిన భారీ వర్షం నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోళ్లు జరపాలని జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. గురువారం ధాన్యం కొనుగోలుపై అడిషనల్​ కలెక్టర్, ఆర్డీవోలు, మార్కెటింగ్, డీఆర్డీవో, వ్యవసాయ, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, తదితర శాఖలకు చెందిన గ్రామ, మండల, జిల్లాస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా రివ్యూ చేశారు. 

ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలన్నారు. అనంతరం అకాల వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని, జిల్లాలో ఎలాంటి నష్టాలు వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. రఘునాథపల్లి ఎన్​హెచ్​రోడ్​ని పరిశీలించి వరద నివారణకు తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు తెలిపారు. 

అనంతరం నిడిగొండ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులు అధైర్యపడొద్దని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఆర్డీవో, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టరేట్​లో ధాన్యం కొనుగోళ్ల సమస్యల పరిష్కారానికి, ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్​ రూంను కలెక్టర్​ ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు లారీలు, గోనె సంచులు, కొనుగోళ్ల ప్రక్రియ మానిటరింగ్​, తదితర సమస్యల పరిష్కారానికి కంట్రోల్​ రూం 8520991823 నంబర్​ ను సంప్రదించవచ్చని సూచించారు.