
జనగామ, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో జనగామ జిల్లా స్టేట్‌లో రెండో స్థానంలో ఉందని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. ఈ నెలలో మొదటి విడతలో 71 శాతం, రెండో విడతలో 86 శాతం గ్రౌండింగ్ పూర్తి కావడంతో ఈ ఘనత సాధ్యమైందన్నారు. గురువారం హౌసింగ్‌పీడీ మాతృ నాయక్, సిబ్బందికి ప్రశాంసా పత్రం, ల్యాప్ టాప్ ని అందించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో 716 ఇండ్లు మంజూరు కాగా 479, రెండో విడతలో 5282 ఇండ్లు మంజూరు కాగా, 4341 గ్రౌండింగ్ అయినట్లు తెలిపారు. ఇందులో 2693 బెస్మెంట్ లెవల్ లో, 432 గోడల దశ, 187 స్లాబ్ దశలో ఉన్నాయని తెలిపారు. వీటి కోసం రూ.34.98 కోట్లను లబ్ధిదారుల ఖాతాలో జమ చేసినట్లు వివరించారు.
పర్యావరణ పోటీల్లో దేశంలో టాప్..
జాతీయ పర్యావరణ పోటీల్లో జనగామ జిల్లా దేశంలో టాప్ ప్లేస్ లో నిలిచినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా స్టూడెంట్లు 75,156 రిజిస్ట్రేషన్లతో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిపారన్నారు. జిల్లాలో పర్యావరణ, నీటి సంరక్షణ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. వన మహోత్సవంతోపాటు, మన జిల్లా మన నీరు కింద ఇంకుడు గుంతల కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించినట్లు తెలిపారు. క్రమంలో నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ్కాంపిటీషన్స్-2025లో ఉత్తమ ఫలితాలు వచ్చాయన్నారు.
అన్ని ప్రభుత్వ పాఠశాలలతో జూన్‌లోనే స్టూడెంట్లతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశామని, ఆ తర్వాత ప్రైవేటు స్కూల్స్ రిజిస్ట్రేషన్లు పూర్తి చేశాయన్నారు. నేపథ్యంలో జూలై ఫస్ట్‌న మొదలైన ఈ పోటీల్లో తాజాగా ఈ నెలకు సంబంధించి జిల్లా దేశంలో మొదటి స్థానంలో కొనసాగడం అభినందనీయమన్నారు.