మక్తల్, వెలుగు : స్టూడెంట్లకు నాణ్యతతో కూడిన టేస్టీ ఫుడ్ అందించాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ టీచర్లకుసూచించారు. మంగళవారం మక్తల్ నియోజకవర్గంలో ఆమె పర్యటించారు. ముందుగా మక్తల్‌లోని మహాత్మాజ్యోతిరావుఫూలే స్కూల్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ టెన్త్ సిలబస్ ఎంత వరకు పూర్తయిందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం భోజన సదుపాయాలపై ఆరా తీశారు. హాస్టల్లో ఏమైనా సమస్యలుంటే చెప్పాలని విద్యార్థులను అడిగారు. మధ్యాహ్న భోజన నాణ్యత, రుచిని తెలుసుకునేందుకు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అక్కడి నుంచి మాగనూరు మండలం అమ్మపల్లి, వడ్వాట్, గుడేబల్లూరు, అడవిసత్యారం పరిధిలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.
