మహబూబ్నగర్(నారాయణ పేట)/మక్తల్, వెలుగు: చేనేతసెంటర్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. వచ్చే నెలాఖరు నాటికి పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. గురువారం జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం వద్ద నిర్మిస్తున్న చేనేత సెంటర్ పనులను అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి పరిశీలించారు.
టెస్కో ఓఎస్ రతన్ కుమార్, మహబూబ్ నగర్ చేనేత జౌళి శాఖ ఏడీతో పనుల పురోగతిపై చర్చించారు. టీజీఎంఎస్ఐడీసీ ఈఈ రవీందర్, ఏఈ సాయి మురారి, నారాయణపేట చేనేత జౌళి శాఖ ఏడీ బాబు, ఆర్కిటెక్చర్ ఇస్మాయిల్ పాల్గొన్నారు.
విద్యా ప్రమాణాలు పెంచాలి..
జిల్లాలో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో గురువారం విద్యాశాఖ అధికారులతో వివిధ అంశాలపై రివ్యూ చేశారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీయడంతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. నవంబర్ 14న జిల్లా స్థాయి స్పెల్ బీ, క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
పాఠశాల, మండల స్థాయి పోటీలు పూర్తి చేసి ఉత్తమ విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేయాలని సూచించారు. కేడీఏ పరిధిలోని 19 పైలట్ పాఠశాలలు, జిల్లాలోని 16 పీఎంశ్రీ పాఠశాలల్లో ఫైనాన్షియల్ లిటరసీ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలిపారు. విద్యాశాఖ చేపడుతున్న అన్ని కార్యక్రమాలను సమన్వయం చేస్తూ ‘చదువుల పండగ’ పేరుతో సమగ్ర విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు.
నాణ్యమైన పత్తిని తేవాలి..
కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన పత్తిని తీసుకుని వచ్చి మద్దతు ధర పొందాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. ఊట్కూరు మండలం నిడుగుర్తి గ్రామ రైతు వేదికలో పత్తి రైతులకు కపాస్ కిసాన్ యాప్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రైతులు పత్తిని ఎండబెట్టి 8 నుంచి 12 శాతం తేమ ఉండేలా చూసుకోవాలన్నారు. సదస్సులో వడ్ల కొనుగోలుపై అవగాహన కల్పించారు. డీఏవో జాన్ సుధాకర్, తహసీల్దార్ చింత రవి, ఏవో గణేశ్ రెడ్డి, ఏఈవో ప్రశాంతి
పాల్గొన్నారు.
