
మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: జిల్లాలో క్రాప్ బుకింగ్ వంద శాతం పూర్తి చేయాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి కొత్తగా ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్ గురించి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సోమవారం సాయంత్రం నారాయణపేట సమీపంలోని వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో వ్యవసాయ, మార్కెటింగ్, హార్టికల్చర్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీసీఐ ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్ పై జిల్లా రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఏఈవోలపై ఉందన్నారు. గతంలో జిన్నింగ్ మిల్లు ఓనర్లు ఎల్1, ఎల్2 ప్రకారం పత్తిని కొనుగోలు చేసేవారని, ఈసారి ఆ విధానాన్ని రద్దు చేసి అన్ని మిల్లుల్లో పత్తి కొనుగోలు చేసేలా చూడాలన్నారు.
దీంతో రైతులకు ఇబ్బంది ఉండదని చెప్పారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించి సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఏవో జాన్ సుధాకర్, డీఎస్పీ నల్లపు లింగయ్య, ఏంఎసీ చైర్మన్ శివారెడ్డి, సీపీవో యోగానంద్, జిల్లా మార్కెటింగ్ అధికారి బాలామణి, ఆర్డీవో మేఘాగాంధీ, డీఎస్ వో బాల్ రాజ్, సీసీఐ స్టేట్ జనరల్ మేనేజర్ ప్రజక్తా పాల్గొన్నారు.