
మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అవగాహన కల్పించి మంజూరైన ఇండ్లను త్వరగా నిర్మించుకునేలా చూడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె నారాయణపేట మండలంలోని జాజాపూర్ గ్రామంలో బేస్ మెంట్ స్థాయిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లబ్ధిదారులు తొందరగా ఇండ్లు నిర్మించుకుంటే డబ్బులు ఖాతాల్లో జమవుతాయని తెలిపారు. అధికారులు లబ్ధిదారులను కలిసి ఇండ్ల నిర్మాణాలను వేగంగా చేయించాలన్నారు. ఇండ్ల నిర్మాణాలకు ఫ్రీ ఇసుక సరఫరా అయ్యేలా చూడాలన్నారు. హౌసింగ్ పీడీ శంకర్ నాయక్, ఏఈ, ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శి,తదితరులు పాల్గొన్నారు.