ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

నల్లబెల్లి, వెలుగు: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలకేంద్రంలోని బీసీ బాయ్స్ హాస్టల్​ను అడిషనల్ కలెక్టర్ శ్రీవాత్సవ తనిఖీ చేయగా.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. హాస్టల్​అటెండర్ సాంబమూర్తి స్టూడెంట్లకు కనీసం సౌకర్యాలు కల్పించకుండా.. తనకంటూ సపరేట్ రూం ఏర్పాటు చేసుకుని బోగాలు అనుభవిస్తున్నాడు. రూంలో ఫ్రిడ్జ్, సోఫా, బెడ్ ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో పాటు మహిళలకు సంబంధించిన కొన్ని వస్తువులు కనిపించడంతో అడిషనల్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే ఆయన్ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. హాస్టల్​లో టాయిలెట్లు సరిగ్గా లేవని, బిల్డింగ్ పెచ్చులు ఊడుతున్నాయని, కరెంట్ సరిగ్గా ఉండడం లేదని స్టూడెంట్లు అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కాగా, ఈ హాస్టల్​కు ఇన్​చార్జి వార్డెన్ ఉండడం, అతను రెండు,మూడు హాస్టళ్లు చూడడం, డీడీ శంకర్ నాయక్ సైతం పట్టించుకోకపోవడంతో అనేక సమస్యలు నెలకొన్నాయి. 

సర్పంచ్ పొలం పనులకు జీపీ వర్కర్

మరిపెడ(చిన్నగూడూరు), వెలుగు: మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం చిన్నగూడూరు సర్పంచ్, జీపీ వర్కర్​తో పొలం పనులు చేయించుకోవడం విమర్శలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన సర్పంచ్ కొమ్ము మల్లయ్య.. నిబంధనలకు విరుద్ధంగా సోమవారం జీపీ వాటర్ మెన్ నారాయణతో తన సొంత పొలంలో ఎరువులు చల్లించుకున్నాడు. గ్రామ కార్యదర్శి అజీమ్ ను దీనిపై వివరణ కోరగా సిబ్బంది విధుల్లోనే ఉన్నారని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచ్ పై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

ఇసుక మాఫియా ఆగడాలకు.. పాయిజన్ బాటిల్​తో రైతు నిరసన

వర్ధన్నపేట, వెలుగు: ఇసుక మాఫియా ఆగడాలకు ఓ రైతు ఏకంగా పాయిజన్ బాటిల్​తో నిరసన తెలిపాడు. తన పొలంలో ఇసుక తోడవద్దని ఎంత చెప్పినా వినలేదు. పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదు. పైగా సదరు రైతుపై దాడికి కూడా పాల్పడ్డారు. విసిగివేసారి పోయిన ఆ రైతు పాయిజన్ బాటిల్​తో తన పొలం వద్ద నిరసన తెలిపాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారులో జరిగింది. గ్రామానికి చెందిన సముద్రాల స్వామికి ఎనిమిది ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో ఇసుక మేటలు ఏర్పడడంతో ఇసుక వ్యాపారులు యథేచ్ఛగా ఇసుక తోడుతున్నారు. పొలం వద్దకు వెళ్లే దారిని సైతం ఇసుక కోసం ధ్వంసం చేశారు. రాత్రి పూట రోజుకు 10 నుంచి 15 ట్రాక్టర్ల ఇసుక తరలిస్తున్నాడని వాపోయాడు. ఫెన్సింగ్ వేసినా తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉన్నతాధికారులు స్పందించి, వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.