భూముల సర్వే పక్కాగా చేపట్టాలి

భూముల సర్వే  పక్కాగా చేపట్టాలి
  • కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి  

నిజామాబాద్, వెలుగు : జిల్లాలోని అసైన్డ్, భూదాన్, ప్రభుత్వ భూములను రెవెన్యూ రికార్డుల ఆధారంగా పక్కాగా సర్వే చేపట్టాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్​నుంచి సబ్ కలెక్టర్లు, ఆర్డీవో, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు.  భూముల విస్తీర్ణం, హద్దులు, సర్వే నంబర్ తదితర వివరాలను సేకరించాలని, జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు. 

భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామాల వారీగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లోని దరఖాస్తుల కంటే ముందు ఆన్​లైన్​లో వచ్చిన పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. సాదాబైనామా దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలిస్తూ, ఫీల్డ్ వెరిఫికేషన్ చేయించాలన్నారు.  అడిషనల్​కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, ఆర్డీవో రాజేంద్రకుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ అశోక్, తహసీల్దార్లు, సర్వేయర్లు, గ్రామ పాలన అధికారులు పాల్గొన్నారు. 


భూభారతి దరఖాస్తులు పరిష్కరించండి..  


వర్ని : భూభారతి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యం చేయొద్దన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్లో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని ఆర్జీలు పరిష్కరించారు, పెండింగ్ లో ఎన్ని ఉన్నాయి, ఎంత మందికి నోటీసులు ఇచ్చారు.. అని ఆరా తీశారు. రెండు నెలలుగా దరఖాస్తులు పెండింగ్ లో ఎందుకున్నాయని ప్రశ్నించారు.  సాదాబైనామా పీవోటీ లకు సంబంధించిన అప్లికేషన్లను పరిశీలించి నోటీసులు జారీ చేయాలన్నారు. తహసీల్దార్ సాయిలు, డిప్యూటీ తహసీల్దార్ మమత, సిబ్బంది ఉన్నారు.