
కోదాడ, వెలుగు : కోదాడ పట్టణంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గురువారం ఆకస్మిక తనిఖీలు చేశారు. పట్టణంలోని బాయ్స్ హైస్కూల్ కు చేరుకున్న ఆయన.. పదో తరగతి విద్యార్థుల రీడింగ్ స్కిల్స్ ను పరిశీలించారు. ఈ ఏడాది చేపట్టనున్న కార్యక్రమాలు గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా టీచర్లు కృషి చేయాలని సూచించారు. అనంతరం 100 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని అధికారులను ఆదేశించారు.
మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. అనంతరం కోదాడ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో భూభారతి దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. త్వరగా భూసమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ వాజిద్ అలీ, ఎంఈవో సలీం షరీఫ్, అధికారులు పాల్గొన్నారు.