రైతు దేశానికి వెన్నెముక లాంటివాడు : కలెక్టర్ తేజస్ నందలాల్

రైతు దేశానికి వెన్నెముక లాంటివాడు : కలెక్టర్ తేజస్ నందలాల్

తుంగతుర్తి, వెలుగు : రైతు దేశానికి వెన్నెముక లాంటి వాడని అని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. గురువారం తుంగతుర్తి మండలంలోని తహసీల్దార్ కార్యాలయం, కస్తూర్బా పాఠశాల, ఎరువుల దుకాణాలు, వంద పడకల ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాలు అర్థమవుతున్నాయా..? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

 వంట గదిని పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని సూచించారు. అంతకుముందు మండల కేంద్రంలోని సాయికృష్ణ ఎరువులు దుకాణంలోని రికార్డులను తనిఖీ చేశారు. వంద పడకల ఆస్పత్రిని పరిశీలించి త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ దయానందం, ఎంపీడీవో శేషుకుమార్, జిల్లా వ్యవసాయ అధికారి రమేశ్ బాబు, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.