
సూర్యాపేట కలెక్టరేట్, వెలుగు : అర్హులందరికీ రేషన్ కార్డులను అందజేస్తామని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు. శనివారం కలెక్టరేట్ లో తెలంగాణ పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డితో కలిసి సూర్యాపేట రూరల్, చివ్వెంల మండలాలకు చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ కార్డులు రాని వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొత్త కార్డు కోసం మీ -సేవ కేంద్రాల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సన్నబియ్యం పంపిణీలో రేషన్ డీలర్లు కీలక పాత్ర పోషించాలన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని చెప్పారు. ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తుందని తెలిపారు.
తెలంగాణ పర్యాటక సంస్థ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి మాట్లాడుతూ పేదవారి ఆత్మ గౌరవానికి రేషన్ కార్డులు చిహ్నం అని అన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్కార్డులు అందజేస్తామన్నారు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు, సన్నబియ్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో వేణుమాధవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, డీఎస్ వో మోహన్ బాబు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.