
మునుగోడు, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను హెచ్చరించారు. శుక్రవారం మునుగోడులోని ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో రెవ్యూ నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల పీఎంఏవై గ్రామీన్ ఆన్ లైన్ నమోదులో నిర్లక్ష్యం వహించిన మర్రిగూడ ఎంపీడీవో మునయ్యకు షో కాజ్ నోటీసులు జారీ చేశారు. చండూరు డివిజన్లో సోమవారం నాటికి ఇండ్ల గ్రౌండింగ్ 50 శాతం పురోగతి సాధించేలా చూడాలని ఆదేశించారు.
ఇళ్లు మంజూరై కట్టుకునేందుకు ఆర్థికంగా స్తోమత లేని లబ్ధిదారులను గుర్తించి స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా రుణం తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు. భూభారతిపై కలెక్టర్ సమీక్షించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి అందిస్తున్న సేవలు, ఓపీ, మందులు, స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు. చండూరు ఆర్డీవో శ్రీదేవి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజకుమార్, ఎంపీడీవో, తహసీల్దార్, ఇతర అధికారులు ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.