నీటిని పొదుపుగా వాడుకోవాలి : వెంకట్‌ రావు

నీటిని పొదుపుగా వాడుకోవాలి : వెంకట్‌ రావు

సూర్యాపేట, వెలుగు: జీవకోటికి ప్రాణధారమైన నీటిని ప్రతి ఒక్కరూ పొదుపుగా వాడుకోవాలని కలెక్టర్‌ వెంకట్‌రావు పిలుపునిచ్చారు.  శుక్రవారం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌ ఉద్యోగులకు ఇంకుడు గుంతల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..  గతంలో మనం చేసిన తప్పుల కారణంగా ప్రస్తుతం నీటి సమస్య ఎదుర్కొంటున్నామన్నారు.   

ఉన్న వనరులను జాగ్రత్తగా వాడుకొని భవిష్యత్‌ తరాలకు అందించాలన్నారు.  ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, గ్రామ, మండల కేంద్రాల్లో సామూహిక ఇంకుడు గుంతలు  నిర్మించాలని సూచించారు.   అనంతరం నీటి సంరక్షణపై ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌‌డీవో మధు సూదన్‌రాజ్, జడ్పీ సీఈవో అప్పారావు , మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, కలెక్టరేట్‌ ఏవో సుదర్శన్‌రెడ్డి, సూపరింటెండెంట్ పద్మారావు, ఎన్నికల అబ్జర్వర్‌‌ శ్రీనివాసరాజ్ పాల్గొన్నారు. 

గ్రీవెన్స్‌ కమిటీ ఆఫీస్‌ ప్రారంభం

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌ కమిటీ కార్యాలయాన్ని శుక్రవారం కలెక్టర్ వెంకట్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఈ కమిటీ తనిఖీల్లో సీజ్‌ చేసిన నగదు, వస్తువులను ఆధారాలు చెక్‌ చేసి విడుదల చేస్తుందని చెప్పారు. ప్రజలు రూ.50 వేల లోపు నగదును మాత్రమే తీసుకెళ్లాలని,  ఇంతకన్నా ఎక్కువ  దొరికితే  సీజ్‌చేసి జిల్లా ట్రెజరీలో జమ చేస్తామన్నారు.  

రూ.10 లక్షల కన్నా ఎక్కువ పట్టుబడితే ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చి తరుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.  వ్యాపార లావాదేవీలకు సంబంధించిన నగదుకు ఆధారాలు చూపించాల్సి ఉంటుందన్నారు. సీజ్‌ అయిన నగదు విడుదలకు ఆధారాలతో గ్రీవెన్స్‌ కమిటీ ఇన్‌చార్జి, జడ్పీ సీఈవో అప్పారావు (నెంబర్‌‌: 8374566222)ను సంప్రదించాలని సూచించారు. అడిషనల్‌ కలెక్టర్‌ లత,  జడ్పీ సీఈవో అప్పారావు, డీఆర్‌‌డీవో మధుసూదన్‌రాజు డిప్యూటీ సీఈవో  శిరీష, ఏవో సుదర్శన్‌రేడ్డి, శ్రీనివాస రాజు పాల్గొన్నారు.