గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి : కలెక్టర్ విజయేందిర బోయి

 గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి :  కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని క్యాంపు ఆఫీస్ నుంచి ఆన్ లైన్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. 

నామినేషన్ పత్రాల పరిశీలన, అభ్యర్థిత్వం ఉపసంహరణ , తుది పోటీ అభ్యర్థుల జాబితా సిద్ధం చేసే విధానాలపై వివరించారు. నామినేషన్లను తిరస్కరించే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు స్వయంగా లేదా రాతపూర్వకంగా సమర్పించిన ఉపసంహరణ నోటీసులను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. అధికారులు, సిబ్బంది ఎన్నికల నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్  కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మధుసూదన్ నాయక్, జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి, ఆర్డీవో నవీన్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

అవినీతి రహిత పరిపాలనకు కృషి.. 

అవినీతి రహిత పరిపాలన సమాజ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. యాంటీ-కరప్షన్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా అధికారులు రూపొందిన వాల్ పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతి నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏసీబీ ఇన్​స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.