మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఎన్నికల నిర్వహణలో చిన్న పొరపాటు కూడా తీవ్రమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉన్నందున కేర్ ఫుల్ గా డ్యూటీలు చేయాలని మహబూబాబాద్ కలెక్టర్ విజయేందిర బోయి ఎలక్షన్ ఆఫీసర్లను ఆదేశించారు. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి దశ ఈ నెల 11న నిర్వహించనున్న నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ల జారీ, సామగ్రి పంపిణీ ప్రక్రియపై కలెక్టర్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మార్గనిర్ధేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతూ ఎలక్షన్స్ సజావుగా, విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ధేశించిన ఎలక్షన్ కోడ్ ను తప్పక పాటించాలని ఆదేశించారు. 11న గండీడ్, నవాబ్‌పేట్, రాజాపూర్, మోహమ్మదాబాద్, మహబూబ్‌నగర్ మండలాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్, ఇతర ఎన్నికల సామగ్రి పంపిణీపై దృష్టి పెట్టాలన్నారు.
ప్రత్యక్షంగా ఓటు వేయలేని వారి ఓటు హక్కును రక్షించే ఈ కీలక ప్రక్రియను ఎటువంటి పొరపాట్లు చేయకుండా నిర్వహించడం ప్రతి అధికారికి బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.
