
చిన్నచింతకుంట, వెలుగు: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌలతులు కల్పించాలని కలెక్టర్ విజయేందిర బోయి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా, పక్క రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. జాతరలో పారిశుధ్య సమస్య రాకుండా చూసుకోవాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జాతరలో మత్తు పదార్థాలు అమ్మకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులదేనన్నారు. జాతరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఎస్పీ డి.జానకి, అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఆర్డీవో నవీన్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆలయ ఈవో మదనేశ్వర్ రెడ్డి, చైర్మన్ గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.