మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: పీఎం జన్ మన్ యోజన కింద చెంచు కుటుంబాలకు సంక్షేమ ఫలాలు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గండీడ్, హన్వాడ, మహబూబ్ నగర్ రూరల్, మహమ్మదాబాద్, నవాబుపేట మండలాల్లోని 16 హ్యాబిటేషన్లలో 481 కుటుంబాలకు పీఎం జన్ మన్ యోజన ద్వారా ప్రయోజనం కల్పించాలని సూచించారు.
ఆధార్, ఆయుష్మాన్ భారత్ కార్డులు, జన్ ధన్ అకౌంట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్లు, రేషన్ కార్డులు, పీఎం కిసాన్ క్రెడిట్ కార్డులు, పీఎం కిసాన్ నిధి, పీఎం సమ్మాన్ నిధి ప్రతి కుటుంబానికి అందించాలన్నారు. జాబ్ కార్డు, ఆత్మీయ భరోసా, పెన్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. జీపీ బిల్డింగులు, ప్రైమరీ స్కూల్, రోడ్డు, మంచినీరు, విద్యుత్, అంగన్వాడీ సెంటర్లు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీటీడబ్ల్యూవో కె జనార్ధన్, డీఆర్డీవో నరసింహులు, డీడబ్ల్యూవో జరీనా బేగం, వీఏవో వెంకటేశ్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ చంద్ర శేఖర్ పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో సౌలతులు కల్పించాలి
పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌలతులు కల్పించాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. కలెక్టరేట్ లో కాటన్ మిల్లు ఓనర్లు, సీసీఐ, మార్కెటింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులతో పత్తి కొనుగోళ్లపై సమావేశం నిర్వహించారు. 5 మిల్లుల్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని, మరో మిల్లులోనూ వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలన్నారు. ఈ నెల 6న జిన్నింగ్ మిల్లు అసోసియేషన్ బంద్ దృష్ట్యా రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. అడిషనల్ ఎస్పీ ఎన్బీ రత్నం, ఆర్డీవో నవీన్, డీఏవో వెంకటేశ్, మార్కెటింగ్ ఏడీ బాలామణి పాల్గొన్నారు.
అపార్ ఐడీ వంద శాతం కంప్లీట్ చేయాలి
విద్యార్థులకు అపార్ ఐడీ జనరేషన్ ను వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నగరంలోని పోలీస్ లైన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల అపార్ ఐడీ ప్రోగ్రెస్ ను ఆన్ లైన్ లో చెక్ చేశారు. ప్రతి విద్యార్థికి ఐడీ కేటాయించాలని ఆదేశించారు. డీఈవో ప్రవీణ్ కుమార్ ఉన్నారు.
