ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించాలి : కలెక్టర్ విజయేందిర బోయి

ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించాలి :  కలెక్టర్ విజయేందిర బోయి
  •     కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు :  గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ విజయేందిర బోయి కోరారు.  మంగళవారం కలెక్టరేట్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల మోడల్ కోడ్ ను ప్రతిఒక్కరూ తప్పకుండా పాటించాలన్నారు. 

జిల్లాలో  మొత్తం 3,674 పోలింగ్ కేంద్రాలు ఉండగా,  999 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించామని చెప్పారు. క్రిటికల్  పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సజావుగా సాగేందుకు భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.  వెబ్‌‌‌‌కాస్టింగ్, సీసీ కెమెరాలు, మైక్రో అబ్జర్వర్ల మానిటరింగ్ తోపాటు కట్టుదిట్టమైన పోలీస్ భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 

ఇప్పటివరకు మొదటి దశ నామినేషన్ల స్క్రూటినీ పూర్తయిందని, గడువు దాటిన తర్వాత ఇచ్చే అభ్యంతరాలు చెల్లవని వివరించారు. రిటర్నింగ్ ఆఫీసర్  తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్‌‌‌‌కు వెళ్లవచ్చన్నారు. అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు వారి పేర్ల అక్షర క్రమం ఆధారంగా కేటాయించనున్నట్లు తెలిపారు..

మూడో విడత పక్కాగా నిర్వహించాలి.. 

 గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో దశ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను  పకడ్బందీగా నిర్వహించాలని  కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. నేటి నుంచి మూడో దశ నామినేషన్  ప్రక్రియకు ప్రారంభమవుతున్న నేపథ్యంలో  స్టేజ్-–1 రిటర్నింగ్ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 3, 4, 5,  తేదీల్లో జడ్చర్ల, ముసాపేట్, అడ్డాకల్, భూత్పూర్, బాలానగర్ మండలాల్లోని 38 జీపీ క్లస్టర్లలో  సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. 

ఎన్నికల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్లే కీలకం.. 

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ల పాత్ర కీలకమని కలెక్టర్  విజయేందిర బోయి అన్నారు. మంగళవారం జడ్పీ సమావేశ మందిరంలో  ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తమకు కేటాయించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు అధికారులు తప్పకుండా సమయానికి హాజరుకావాలన్నారు.