
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: పౌష్టికాహార లోపంతోనే పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. పిల్లలు, గర్భిణులు, బాలికలకు పౌష్టికాహారం అందిస్తున్నప్పటికీ నేటికి కొందరు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని అధిగమించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం పోషణ మాసంపై ప్రతిజ్ఞ చేయించారు. బేటి బచావో..- బేటి పడావో.. సెల్ఫీ పాయింట్ వద్ద కలెక్టర్ ఫొటో దిగారు. జడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి, డీఆర్డీవో నర్సింహులు, హార్టికల్చర్ డీడీ వేణుగోపాల్, డీఎంహెచ్ వో పద్మజ, డీపీవో పార్థసారథి, డీడబ్ల్యూవో జరీనా బేగం, డీఈవో ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
ఆర్టీఐపై అవేర్నెస్ పెంచుకోవాలి..
ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకతను తీసుకువచ్చేందుకు సమాచార హక్కు చట్టంపై అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన ఓరియెంటేషన్ ప్రోగ్రామ్‌కు అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ తో కలిసి పాల్గొని మాట్లాడారు. ఆర్టీఐ దరఖాస్తులకు నిర్ణీత వ్యవధిలో సమాచారం అందించాలని ఆదేశించారు.
అలర్ట్ గా ఉండండి..
వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వివిధ అంశాలను రివ్యూ చేశారు. కాజ్‌వేలు, చెరువులు, కుంటలు, రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యాధులు ప్రబలకుండాచర్యలు తీసుకోవాలని ఆదేశించారు.