మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: గండీడ్ మండలం వెన్నచేడ్ మాడల్ స్కూల్, జూనియర్ కాలేజీలను గురువారం కలెక్టర్ విజయేందిర బోయి సందర్శించారు. మోడల్ స్కూల్ లో ఆస్ట్రో ల్యాబ్ ను పరిశీలించి, ల్యాబ్ లో ఉన్న టెలీస్కోప్, ప్రయోగాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్ట్రో ల్యాబ్ ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం హెల్త్ కేర్ ల్యాబ్, పీటీఆర్సీ ల్యాబ్ ను పరిశీలించారు.
మధ్యాహ్నం భోజనం చేస్తున్న స్టూడెంట్స్ మాట్లాడారు. మిషన్ భగీరథ నీళ్లు సరిపడా రావడం లేదని చెప్పడంతో, మోడల్ స్కూల్ నుంచి హాస్టల్ వరకు పైపులైన్ పొడిగించాలని మిషన్ భగీరథ ఎస్ఈని ఆదేశించారు. రంగారెడ్డిపల్లి వద్ద పైపులు డ్యామేజీ కావడంతో 8 గ్రామాలకు 20 రోజులుగా తాగునీరు సరిగా రావడం లేదని గ్రామస్తులు తెలపగా, వారం రోజుల్లో సమస్య పరిష్కరించాలని ఎస్ఈ చల్మారెడ్డికి సూచించారు.
క్రీడా స్థలాన్ని పరిశీలించి ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చదును చేయించడానికి, గ్రామం నుంచి మోడల్ స్కూల్ వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రపోజల్స్ పంపాలని సూచించారు. తహసీల్దార్ మల్లికార్జున్, ఇన్చార్జి ఎంపీడీవో హరిశ్చంద్రా రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మహమ్మదాబాద్ మండలం లింగాయపల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరాన్ని సందర్శించారు. జిల్లాలోని అన్ని గ్రామాల రైతులు తమ పశువులకు టీకాలు వేయించాలని సూచించారు. గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించి, నాణ్యతగా నిర్మించుకోవాలని సూచించారు.
