అడ్డాకుల, వెలుగు : ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మహబూబ్నగర్ కలెక్టర్ విజయంద్రబోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలంలో ఆమె పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ రైతులకు అవసరమైన టార్పాలీన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. తిమ్మాపూర్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు. తిమ్మాపూర్ గ్రామం అంగన్వాడీలోని మధ్యాహ్నం భోజనాలను పరిశీలించారు. నాణ్యత లేకపోవడంతో సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందజేయాలని చెప్పారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట డీఆర్డీవో నరసింహులు, తహసీల్దార్ రాజు, అధికారులు ఉన్నారు.
