ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఖమ్మం టౌన్, వెలుగు: జిల్లాకు మంజూరైన మెడికల్​ కాలేజీ ఏర్పాటుకు భవనాలు, సదుపాయాలను శనివారం కలెక్టర్  వీపీ గౌతమ్, రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్​ డాక్టర్ రమేశ్ రెడ్డి పరిశీలించారు. వీసీ హాల్, ప్రజ్ఞ సమావేశ మందిరం, రికార్డ్​ రూమ్, సివిల్ సప్లయ్​ బిల్డింగ్, ఈవీఎం గోడౌన్, రోడ్లు భవనాల శాఖ కార్యాలయాలను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న భవనాలకు అవసరమైన మార్పులు చేసుకొని ఉపయోగంలోకి తేవాలని డైరెక్టర్​ సూచించారు. కౌన్సిల్ హాల్, ప్రిన్సిపాల్ చాంబర్, అకాడమిక్ సెక్షన్, హిస్తాలజీ ల్యాబ్, లెక్చర్ హాల్  ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. అడిషనల్​ కలెక్టర్ ఎన్. మధుసూదన్, డిప్యూటీ డైరెక్టర్​ డాక్టర్. చంద్రశేఖర్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్​ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో డాక్టర్ శ్రీనివాస్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఈఈ ఉమామహేశ్వరరావు,ఆర్అండ్ బీ డీఈ విశ్వనాథ్  పాల్గొన్నారు.

రామయ్యకు బంగారు తులసీదళార్చన

భద్రాచలం,వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి శనివారం బంగారు తులసీదళాలతో అర్చన జరిగింది. గర్భగుడిలో సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించాక సువర్ణ తులసీదళాలతో అర్చన నిర్వహించారు. అంతకు ముందు భద్రుని మండపంలో రామపాదుకలకు పంచామృతాలతో అభిషేకం చేశారు. కల్యాణమూర్తులను ప్రాకార మండపంలోకి ఊరేగింపుగా తీసుకెళ్లి నిత్య కల్యాణం జరిపారు. భక్తులు కంకణాలు ధరించి స్వామి వారి కల్యాణ క్రతువులో పాల్గొన్నారు. మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది.

విలువల కోసమే చట్టాలు

ఖమ్మం టౌన్, వెలుగు: అనాదిగా ప్రజల్లో ఉన్న నైతిక విలువల ఆధారంగానే చట్టాలు వచ్చాయని, వీటిని అమలు చేయడం ద్వారా సామాజిక దురాచారాలను నిర్మూలించవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి శ్రీనివాసరావు అన్నారు. సాంఘిక దూరచారాల నిర్మూలనలో భాగంగా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ప్రారంభించారు. లీగల్​ సెల్​ సెక్రటరీ మహమ్మద్ జావీద్ పాషా, బార్ అసోసియేషన్  అధ్యక్షుడు జి.రామారావు, ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేశ్, న్యాయవాదులు ఇమ్మడి లక్ష్మీ నారాయణ, కల్యాణి, శ్రీనివాసరావు, రవికుమార్, డి.వెంకటేశ్వర్లు, ఎం.కన్నాంబ, అన్నం శ్రీనివాసరావు, సీడబ్ల్యూసీ సభ్యుడు లింగయ్య పాల్గొన్నారు.

తప్పులు సరి దిద్దుకోవాలి

సత్తుపల్లి: తప్పులను సరిదిద్దుకొని ముందుకెళ్లాలని జిల్లా జడ్జి టి. శ్రీనివాసరావు సూచించారు. లీగల్​ సెల్​ ఆధ్వర్యంలో కొత్తూరులోని మదర్  థెరిసా ఇంజనీరింగ్ కాలేజీలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులను గౌరవించాలని, క్రమశిక్షణతో కష్టపడి చదవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. అనంతరం బార్ అసోసియేషన్  హాల్ ను ప్రారంభించి న్యాయవాదులతో సమావేశమయ్యారు. సీనియర్  సివిల్ జడ్జి పి అరుణ కుమారి, ప్రిన్సిపల్  జూనియర్  సివిల్  జడ్జి సీహెచ్ శ్రావణ స్వాతి, అడిషనల్​ జూనియర్ సివిల్ జడ్జి అయేషా సరీన్, సెకండ్​ క్లాస్​ మెజిస్ట్రేట్​ గోపాలరావు, బార్​ అసోసియేషన్  అధ్యక్షుడు  రాజేంద్రప్రసాద్, ఇంజనీరింగ్  కాలేజీ ప్రిన్సిపాల్ డా. చలసాని హరి కృష్ణ, కరస్పాండెంట్ చలసాని సాంబశివరావు పాల్గొన్నారు. 

వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి

ఖమ్మం టౌన్, వెలుగు: వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత చనిపోయిందని ఆరోపిస్తూ శనివారం మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి.. మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు గ్రామానికి చెందిన గుండ్లపల్లి మమత(21) తన పుట్టినిల్లు కామేపల్లి మండలం సాతానిగూడేనికి కాన్పు కోసం వచ్చింది. ఈ నెల 1న మాత శిశు సంరక్షణ కేంద్రంలో జాయిన్  కాగా, 2న సిజేరియన్​ చేశారు. కుట్లు సరిగా వేయకపోవడంతో తీవ్ర రక్త స్రావంతో పాటు చీము రావడంతో రెండోసారి కుట్లు వేశారు. అవి కూడా ఫెయిల్  కావడంతో మమత తీవ్ర అస్వస్థతకు గురైంది. శుక్రవారం రాత్రి ఆమె పరిస్థితి విషమించడంతో చనిపోయిందని డాక్టర్లు చెప్పారని కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్లు నిర్లక్ష్యంతో చేయడంతోనే మమత చనిపోయిందని ఆరోపిస్తూ హాస్పిటల్  వద్ద ఆందోళనకు దిగారు. హాస్పిటల్ సూపరింటెండెంట్  బి.వెంకటేశ్వరరావు ఈ ఘటనపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టూ టౌన్  సీఐ శ్రీధర్  తెలిపారు. 

బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడి నియామకం
ఖమ్మం టౌన్, వెలుగు: బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా జక్కుల ప్రకాష్ యాదవ్ ను నియమిస్తూ బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు పిండిప్రోలు రామ్మూర్తి నియామకపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సంఘం లీడర్లు కాసోజు రఘుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి జంగం వేణు,జిల్లా ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు చంద్రకాని రమణ యాదవ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ పోతాగని రమణ కుమార్  పాల్గొన్నారు.

ఖమ్మంలో ది కే స్ట్రీట్  ప్రారంభం
ఖమ్మం టౌన్, వెలుగు: సిటీలో కొత్తగా ఏర్పాటైన ఇండోర్ గేమింగ్ జోన్  ది కే స్ట్రీట్ లో చేరి దీపావళి పండుగను చిన్నారులతో ఎంజాయ్ చేయాలని మేనేజింగ్  డైరెక్టర్  మాధవన్  కోరారు. హైదరాబాద్ కు ధీటుగా ఖమ్మంలో ది కే స్ట్రీట్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆడుకోవడానికి గేమ్స్, బాక్స్ క్రికెట్ ను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చని చెప్పారు.

రక్తదానంతో ప్రాణదానం
రక్తదానంతో ప్రాణదానం చేసిన వాళ్లమవుతామని భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ డాక్టర్​ వినీత్​ అన్నారు. పోలీస్​ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా కొత్తగూడెంలో శనివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 130 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. భద్రాచలం బీఎస్ఆర్​ గార్డెన్స్ లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏఎస్పీ రోహిత్​రాజ్​ ప్రారంభించి తాను కూడా రక్తదానం చేశారు. 140 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. పాల్వంచ పోలీస్ స్టేషన్ లో రక్తదాన శిబిరాన్ని డీఎస్పీ సత్యనారాయణ ప్రారంభించారు. ఇల్లందు పోలీస్ స్టేషన్​లో రక్తదాన శిబిరాన్ని డీఎస్పీ రమణమూర్తి ప్రారంభించారు. 150 మంది రక్తదానం చేశారు. మణుగూరులోని ఇల్లందు క్లబ్ లో రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, డీఎస్పీ ఎస్వీ రాఘవేంద్రరావు ప్రారంభించారు.  - వెలుగు, నెట్​వర్క్

ఇద్దరు దొంగల​ అరెస్ట్, 11.3 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు దొంగలను అరెస్ట్​ చేసి 11.3 తులాల బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్​ కమిషనర్​ విష్ణు ఎస్​ వారియర్​ తెలిపారు. శనివారం సీపీ ఆఫీస్​లో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 13న కమాన్​బజార్​లో నిద్రిస్తున్న వృద్ధురాలి మెడలో నుంచి గొలుసు ఎత్తుకుపోయిన ఘటనలో, ఖమ్మం రూరల్​ మండలం పెద్ద వెంకటగిరి గ్రామానికి చెందిన పెయింటింగ్​ వర్కర్​ కాలేపొంగు నవీన్(24)ను అరెస్ట్​ చేసి 3.32 తులాల బంగారు అభరణాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వరుస చోరీలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ముదిగొండ మండలం మల్లన్నపాలెంకు చెందిన షేక్​ రఫీని అదుపులోకి తీసుకుని రూ.3.70 లక్షల విలువైన 8.13 తులాల బంగారు అభరణాలు, వెండి వస్తువులను రికవరీ చేశామన్నారు. నిందితులను పట్లుకున్న సీసీఎస్​ ఏసీపీ టి రవి, సీఐ మల్లయ్యస్వామి, వన్​టౌన్​ సీఐ చిట్టిబాబు, కారేపల్లి ఎస్ఐ కుశకుమార్​ తదితరులకు క్యాష్​ రివార్డులు అందించి అభినందించారు.

‌‌‌‌అధిక వడ్డీలు వసూలు చేస్తే కఠినచర్యలు 

అధిక వడ్డీలకు డబ్బులు అప్పుగా ఇచ్చి బలవంతంగా వసూలు చేసే వారిపై చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగి ప్రజలను ఇబ్బందులు పెడుతున్న వారిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. 

మెరిట్​ ప్రకారం టీచర్లను పంపాలి

భద్రాచలం,వెలుగు: కొత్తగా నిర్మిస్తున్న గురుకులం, ఈఎంఆర్ఎస్​ పాఠశాలకు మెరిట్​ ప్రకారం టీచర్లను పంపాలని గురుకులం ఆర్సీవో డేవిడ్​రాజ్​ ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గురుకులం ప్రిన్సిపాళ్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. కొత్తగా నిర్మించే గురుకులం కాలేజీకి జిల్లాలోని గురుకులాల్లో పని చేసే టీచర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. బాలికల కళాశాలల్లో మహిళా అధ్యాపకులను, బాలుర కళాశాలలో పురుషులను మాత్రమే నియమించాలని సూచించారు. ఇటీవల జూనియర్​ లెక్చరర్ల పోస్టులకు అప్లై చేసి ఎంపికైన వారిని ఆయా కళాశాలల్లో నియమించాలన్నారు. గతంలో గురుకులాల్లో పని చేసి వెళ్లిపోయిన వారి వివరాలను తనకు అందించాలని ఆదేశించారు. ఐటీడీఏ స్పెషల్ ఆఫీసర్​ అశోక్​కుమార్, కాలేజీల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

మౌలిక వసతులు కల్పించాలని ధర్నా

చండ్రుగొండ,వెలుగు: గిరిజన గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని భారతీయ సర్వ సమాజ్  మహాసంఘ్  రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి సామేలు డిమాండ్ చేశారు. శనివారం బీఎస్ఎస్ఎం మండల కమిటీ  ఆధ్వర్యంలో తహసీల్దార్​ ఆఫీస్​ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని వెంకటయ్యతండా, రావికంపాడు, వంకనెంబర్ గ్రామాల్లో  పక్కా ఇండ్లు, తాగునీరు, సీసీరోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ లాంటి సౌలతులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్యలను కలెక్టర్, రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ  కమిషన్  దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అనంతరం తహసీల్దార్​ రవికుమార్ కు వినతిపత్రం అందచేశారు. మండల అధ్యక్షుడు శేషుకుమార్, లీడర్లు నాగేంద్రబాబు, రవి, సుదర్శన్, సీతాకుమారి, నిర్మల, కోటమ్మ, కరుణ పాల్గొన్నారు. 

దేవాదాయ శాఖ సిబ్బందిపై దాడికి యత్నం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పట్టణంలోని చిట్టివారి సత్రం ల్యాండ్​ నుంచి సామగ్రిని తీసుకెళ్తుండగా, అక్కడికి వెళ్లిన దేవాదాయ శాఖ సిబ్బందిపై వారు దాడికి యత్నించారని గణేశ్​​టెంపుల్​ ఈవో సులోచన తెలిపారు. సర్వే నెంబర్​ 142లోని చిట్టివారి సత్రం భూమిపై కోర్టులో వివాదం నడుస్తుందన్నారు. కేసు పెండింగ్​లో ఉండగానే దుర్గా కళామందిర్​కు చెందిన వ్యక్తులు అక్కడి సామగ్రిని శుక్రవారం రాత్రి తరలిస్తున్నారనే సమాచారంతో సిబ్బందిని పంపించినట్లు తెలిపారు. అడ్డుకున్న సిబ్బందిపై దాడికి యత్నించారని ఆరోపించారు. ఈ విషయాన్ని కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

రామచంద్రాపురంలో బస్తీ సంపర్క్ అభియాన్

ఎర్రుపాలెం, వెలుగు: మండలంలోని రామచంద్రపురంలో బీజేపీ లీడర్లు బస్తీ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా, కిసాన్ మోర్చా రాష్ట్ర నేత నూతక్కి నరసింహారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోటమర్తి సుదర్శన్, దేవరకొండ కోటేశ్వరరావు, చిలువేరు సాంబశివరావు, మొక్కపాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

కోవర్టుల దిష్టిబొమ్మ దహనం

పాల్వంచ,వెలుగు: మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్  పార్టీలోని కొందరు కోవర్టులు ఇతర పార్టీలకు లోపాయికారి మద్ధతు తెలపడాన్ని  నిరసిస్తూ రేవంత్  యువసేన ఆధ్వర్యం లో శనివారం పాల్వంచలో కాంగ్రెస్  కోవర్టుల దిష్టిబొమ్మను దహనం చేశారు. యువసేన జిల్లా కన్వీనర్ వానపాకుల రాంబాబు, నాయకులు వి రాము, జె శ్రీను, కె రమేశ్, సీహెచ్ నాగేశ్వరరావు, పి అశోక్, ఎం దేవా, సురేశ్​ పాల్గొన్నారు. 

ఐద్వా ఆధ్వర్యంలో..

హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ పాఠశాలలో చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన ఉన్మాదిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో ఉన్మాది దిష్టిబొమ్మను దహనం చేశారు. ఐద్వా జిల్లా, పట్టణ కార్యదర్శులు ఎం జ్యోతి, కె సత్య, సభ్యులు రోజా, పాపమ్మ, ఉష, రాధిక పాల్గొన్నారు. 

ఈజీఎస్​లో భారీగా అక్రమాలు

ములకలపల్లి, వెలుగు: మండలంలో చేపట్టిన ఈజీఎస్​ పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయని మరోసారి సోషల్ ఆడిట్  నిర్వహించాలని అధికార పార్టీకి చెందిన ఎంపీపీ మట్ల నాగమణి, ఎంపీటీసీ మెహర్ మణి, జడ్పీటీసీ సున్నం నాగమణి డిమాండ్ చేశారు. మీడియాతో వారు మాట్లాడుతూ గురువారం నిర్వహించిన ఓపెన్ ఫోరంలో కూలీలు, రైతులు, మేట్లు లేకపోవడంతో వాయిదా వేయాలని వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఏజెన్సీలో ప్రజాప్రతినిధులంటే లెక్క లేదా అని ప్రశ్నించారు. కలెక్టర్ జోక్యం చేసుకోవాలని  కోరారు.

చెట్లు నరికితే  చర్యలు తప్పవు

వైరా, వెలుగు: అటవీ ప్రాంతంలో చెట్లు నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎఫ్​వో సిద్ధార్థ విక్రమ్ సింగ్  హెచ్చరించారు. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామ సమీపంలో పోడు నరుకుతున్న వారిని ఫారెస్ట్  అధికారులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతాన్ని డీఎఫ్​వో పరిశీలించారు. పోడు భూములు నరికే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎఫ్డీవోలు మంజుల, ప్రకాష్ రావు, వైరా సీఐ సురేశ్,  కొణిజర్ల ఎస్ఐ యయాతి రాజు పాల్గొన్నారు. 

రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తే లక్ష్యం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని కొత్తగూడెం ఏరియా జీఎం జక్కం రమేశ్​​అన్నారు. జీకే ఓసీలో రక్షణ వారోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన ప్రోగ్రాంలో ఆయన మాట్లాడుతూ రక్షణలో జీకే ఓసీ మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. డి. శ్యాంసుందర్, రామ్మోహన్, బాలాజీ నాయుడు, ప్రసాద్, రాజ్​కుమార్, రవీందర్, సదానందం, రమణారెడ్డి, టీజీకేఎస్​ నాయకులు రజాక్, కె కృష్ణ పాల్గొన్నారు. 

సీసీటీఎన్ఎస్​నువినియోగించాలి

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: నేర దర్యాప్తులో క్రైం అండ్​ క్రిమినల్​ ట్రాకింగ్​ నెట్​వర్క్​ అండ్​ సిస్టమ్(2.0)ను అందుబాటులోకి తెచ్చిందని సీపీ విష్ణు ఎస్​ వారియర్​ తెలిపారు. దీనిని వినియోగించి నేర పరిశోధన, విచారణలో వినియోగించాలని పోలీస్​ కాన్ఫరెన్స్​ హాల్​లో శనివారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో పోలీస్​ అధికారులకు సూచించారు. అడిషనల్​ డీసీపీ డాక్టర్​ శబరీష్​, ఏడీసీపీ సుభాశ్​​చంద్రబోస్, ఏసీపీలు బస్వారెడ్డి, రామోజీ రమేశ్, అంజనేయులు, రెహమాన్, వెంకటేశ్, ప్రసన్నకుమార్, రవి, వెంకటస్వామి పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీ ప్రమోషన్లలో జాప్యం లేదు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో పని చేస్తున్న ఎస్టీ, ఎస్టీ ఉద్యోగులు, అధికారుల ప్రమోషన్లలో ఎటువంటి జాప్యం జరగడం లేదని డైరెక్టర్​ ఎన్  బలరాం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం, లైజన్​ ఆఫీసర్ల బృందం ప్రతినిధులు శనివారం డైరెక్టర్​ను కలిశారు. ఖాళీలు, రిజర్వేషన్లపై డైరెక్టర్​తో చర్చించారు. జీఎంలు ఎన్. సుధాకర్​ రావు, కె.బసవయ్య, రాజేశ్వర్​రావు, ఆంతోటి నాగేశ్వరరావు, బి నాగేశ్వరరావు, మాల కొండయ్య, కలవల చంద్రశేఖర్, హతీరాం, శ్రీనివాస్, గణేశ్, ఎంవీ రావు, ఓదెలు, మోరే రమేశ్, బందెల విజేందర్, సాయి పాల్గొన్నారు.

సర్పంచ్​ సస్పెన్షన్​

​నేలకొండపల్లి, వెలుగు: ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు సహకరించడం లేదనే కారణంతో మండలంలోని గువ్వలగూడెం సర్పంచ్  వంగూరి వెంకటేశ్వర్లును సస్పెండ్​ చేస్తూ కలెక్టర్  వీపీ గౌతమ్  ఉత్తర్వులు జారీ చేశారు. క్రీడా ప్రాంగణం పనులను ప్రారంబించకపోవడం, హరితహారంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటడంలో నిర్లక్ష్యం చేయడంతో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సరైన సమాధానం రాకపోవడంతో మూడు నెలల పాటు సస్పెండ్​ చేశారు. ఇదిలాఉంటే పనులు చేసినా దళితుడిననే కారణంతో వేటు వేశారని సర్పంచ్​ వెంకటేశ్వర్లు ఆరోపించారు.

దివ్యాంగురాలిపై అత్యాచారయత్నం

ములకలపల్లి, వెలుగు: దివ్యాంగురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజీవ్ నగర్ కు చెందిన దివ్యాంగురాలిపై ఈ నెల 20న అదే గ్రామానికి చెందిన కుర్సం ప్రభాకర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పెద్దమ్మ ఇంట్లో నిద్రిస్తుండగా అత్యాచారానికి యత్నించగా కేకలు వేయడంతో పరారయ్యాడు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్​ తెలిపారు.   

ఆయిల్ పామ్ మొక్కలు చోరీ

అశ్వారావుపేట, వెలుగు: పట్టణం సమీపంలోని పట్టు పరిశ్రమ కేంద్రంలో నుంచి శుక్రవారం రాత్రి 70 ఆయిల్ పామ్ మొక్కలను ట్రాలీలో తరలిస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. డ్రైవర్  పరారవ్వగా, ట్రాలీని పోలీస్ స్టేషన్ కు తరలించారు.