పంచాయతీ ఎన్నికలకు  10 వేల మంది సిబ్బంది : కలెక్టర్ వీపీ గౌతమ్

పంచాయతీ ఎన్నికలకు  10 వేల మంది సిబ్బంది : కలెక్టర్ వీపీ గౌతమ్

ఖమ్మం టౌన్, వెలుగు : పంచాయతీ ఎన్నికల  నిర్వహణకు సిబ్బంది డాటా నమోదు పకడ్బందీగా చేయాలని అధికారులకు కలెక్టర్ గౌతమ్ సూచించారు. శనివారం కలెక్టర్, నూతన కలెక్టరేట్ లోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో సిబ్బంది చేపడుతున్న డాటా నమోదు ప్రక్రియ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 589 గ్రామ పంచాయతీలకు గాను 5,398 వార్డులు ఉన్నట్లు తెలిపారు. ఇందుకనుగుణంగా వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం, పెద్ద వార్డులు ఉన్న చోట్ల రెండు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు అవసరమన్నారు.

ఓటర్ల సంఖ్య నిర్ధారణ అయ్యాక పోలింగ్ కేంద్రాల సంఖ్య తెలుస్తుందని చెప్పారు. సుమారు 10 వేల మంది ఎన్నికల సిబ్బంది అవసరం ఉంటుందన్నారు. డాటా నమోదు పర్యవేక్షణకు అధికారులను నియమించాలని చెప్పారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి హరికిషన్, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, కలెక్టరేట్ ఏవో అరుణ, డివిజనల్ పంచాయతీ అధికారి పుల్లారావు, ఈడీఎం దుర్గాప్రసాద్, అధికారులు ఉన్నారు.