డెంగ్యూ పేరుతో ప్రజలను భయపెడితే చర్యలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

డెంగ్యూ పేరుతో ప్రజలను భయపెడితే చర్యలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ అర్బన్, వెలుగు : డెంగ్యూ కేసుల పేరుతో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి బెదిరింపులకు ఎవరైనా పాల్పడితే చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. మంగళవారం నల్గొండలోని కలెక్టరేట్ లో సీజనల్​వాధుల నివారణపై వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సీజన్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

 ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి వైద్యాధికారి తన పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లను సందర్శించి అవసరమైతే విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయాలని తెలిపారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, డీఎంహెచ్​వో పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్​వోలు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ , వైద్యాధికారులు పాల్గొన్నారు. 

ఆర్థిక సాయం అందజేయడం అభినందనీయం

నల్గొండ అర్బన్, వెలుగు : అత్యాధునిక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మొబైల్ టీబీ ఎక్స్​రే పరికరానికి ఆర్థిక సాయం అందించిన మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి అభినందించారు. మంగళవారం నల్గొండ కలెక్టరేట్ లో మిర్యాలగూడ రైస్ మిల్లర్ అసోసియేషన్ సభ్యులు కలెక్టర్​ను కలిశారు. ఏఐ టీబీ మొబైల్ ఎక్స్ రే మేషీన్​కోసం రూ.18 లక్షల చెక్కును కలెక్టర్​కు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు ఏఐ టీబీ మొబైల్ ఎక్స్ రే యంత్రం కొనుగోలు కోసం ఆర్థిక సాయం అందించడం గొప్పవిషయమన్నారు. 

ఈ యంత్రం ద్వారా అక్కడికక్కడే పేషెంట్లకు పరీక్షలు నిర్వహించి వ్యాధిని నిర్ధారించవచ్చని తెలిపారు. కలెక్టర్​ను కలిసిన వారిలో డీఎం హెచ్ వో డాక్టర్ పుట్ల  శ్రీనివాస్, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, మిర్యాలగూడ రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, వెంకటరమణచౌదరి, ఉపాధ్యక్షుడు  సంతోష్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్, నల్గొండ సంఘం అధ్యక్షుడు నారాయణ, కార్యదర్శి భద్రాద్రి తదితరులు ఉన్నారు.