పెట్రోల్ పోసుకుని మరో యువతి ఆత్మహత్య.. నెలలోనే మూడో ఘటన.. ఒడిషాలో అసలేం జరుగుతోంది..?

పెట్రోల్ పోసుకుని మరో యువతి ఆత్మహత్య.. నెలలోనే మూడో ఘటన.. ఒడిషాలో అసలేం జరుగుతోంది..?

భువనేశ్వర్: ఒడిషాలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి వేధింపులు భరించలేక డిగ్రీ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన  కేంద్రపారా జిల్లాలో బుధవారం (ఆగస్ట్ 6) చోటు చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతిపై మృతిపై దర్యాప్తు చేస్తున్నామని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని కేంద్రపార ఎస్పీ సిద్ధార్థ్ కటారియా పేర్కొన్నారు. 

ప్రియుడి వేధింపుల వల్లే తన కూతురు ఈ దారుణానికి ఒడిగట్టిందని మృతురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. మానసికంగా, శారీరకంగా వేధించడంతో పాటు సన్నిహితంగా దిగిన ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేశాడని ఆరోపించారు. తను చెప్పినట్లు వినకపోతే చంపేస్తానని బెదిరించాడని చెప్పారు. ప్రియుడి వేధింపులు భరించలేక తన కూమార్తె ఆరు నెలల క్రితమే స్థానిక పోలీసులు ఫిర్యాదు చేసిందని.. పర్సనల్ ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ వేధిస్తున్నాడని ప్రియుడుపై కంప్లైంట్ చేసిందని తెలిపారు. పోలీసులు నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే కాకుండా.. ప్రియుడి నెంబర్ బ్లాక్ చేయమని తన కూతురికి ఉచిత సలహా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

ఓడిషాలో అసలేం జరుగుతోంది..?

గడిచిన నెలలోనే ఒడిషాలో ఈ తరహా ఘటన మూడోది. ఫ్రొఫెసర్ వేధింపులు భరించలేక 2025, జూలై 12 బాలసోర్‌లోని ఎఫ్‌ఎం కళాశాలకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని క్యాంపస్‎లోనే ప్రెటోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. రెండు రోజుల తర్వాత -భువనేశ్వర్‌ ఎయిమ్స్‎లో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటన మరువకముందే.. పూరి జిల్లాలోని బలంగా ప్రాంతానికి చెందిన మరో 15 ఏళ్ల బాలిక 2025, ఆగస్టు 2న కాలిన గాయాలతో మరణించింది. 

ఓ వైపు ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుండగానే.. తాజాగా కేంద్రపారా జిల్లాలో ప్రియుడి వేధింపులు భరించలేక మరో యువతి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నెల రోజుల వ్యవధిలోనే ముగ్గురు యువతులు వివిధ  కారణాలతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యలకు పాల్పడటం రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీంతో ఓడిషాలో అసలేం జరుగుతుందని.. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. యువతి ఫిర్యాదు చేసిన వెంటనే నిందితుడిపై పోలీసులు యాక్షన్ తీసుకుని ఉంటే.. ఇవాళ యువతి ప్రాణాలతో ఉండేదని.. సదరు యువతిది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వ హత్య అని ప్రతిపక్షాలు ఆరోపించాయి.