ఎన్​కౌంటర్​లో కల్నల్ సహా ఐదుగురు జవాన్లు మృతి

ఎన్​కౌంటర్​లో కల్నల్ సహా ఐదుగురు జవాన్లు మృతి
  • ఇద్దరు టెర్రరిస్టులు హతం

శ్రీనగర్: ఇండియన్ ఆర్మీ టార్గెట్​గా పాకిస్థాన్ టెర్రరిస్టులు రెచ్చిపోయారు. ఆదివారం ఉదయం ఉత్తర కాశ్మీర్​లోని కుప్వారా జిల్లా హంద్వారాలో కాల్పులకు తెగబడ్డారు. సెక్యూరిటీ సిబ్బంది ఎదురుదాడి చేసి ఇద్దరు టెర్రరిస్టులను అంతమొందించారు. శనివారం రాత్రి నుంచి ఎనిమిది గంటలకు పైగా జరిగిన ఈ ఆపరేషన్ లో దురదృష్టవశాత్తు ఐదుగురు ఆర్మీ జవాన్లు చనిపోయినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దిల్‌బాగ్ సింగ్ వెల్లడించారు. విధి నిర్వహణలో ఒక కల్నల్, మేజర్ తో పాటు ముగ్గురు జవాన్లు అమరులయ్యారని తెలిపారు. అమరవీరులలో ఒకరు 21 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అశుతోష్ శర్మ కాగా, మేజర్ అనుజ్ సూద్, నాయక్ రాజేశ్, లాన్స్ నాయక్ దినేశ్, మరొకరు జమ్మూకాశ్మీర్ పోలీస్ సబ్ ఇనిస్పెక్టర్ షకీల్ ఖాజీ ఉన్నారని చెప్పారు.

హంద్వారాలోని చాంగిముల్లాలోని ఒక ఇంట్లో టెర్రరిస్టులు.. కొంతమంది పౌరులను బందీలుగా తీసుకుంటున్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించారని, టెర్రరిస్టులు చొరబడిని ఇంట్లో బందీలుగా ఉన్న పౌరులను కల్నల్ టీమ్ ధైర్యంగా రక్షించిందని డీజీపీ మీడియాతో చెప్పారు. ఐదుగురు ఆర్మీ, పోలీసు సిబ్బందితో కూడిన టీమ్ టెర్రరిస్టులు ఉన్న ప్రాంతంలోకి ప్రవేశించి పౌరులను విజయవంతంగా వెనక్కి తీసుకువచ్చిందన్నారు. ఈ ఆపరేషన్ లో భారీగా కాల్పులు జరిగాయని, ఇద్దరు టెర్రరిస్టులను హతమయ్యారని చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి చొరబడిన టెర్రరిస్టులు .. హంద్వారాలోని కొంతమందిని వారి గ్రూపుల్లోకి తీసుకునేందుకు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. అధికారిక వీడ్కోలు పలికిన తర్వాత కల్నల్ శర్మ మృతదేహాన్ని ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు, మేజర్ సూద్ మృతదేహాన్ని చండీగఢ్ కు తరలించనున్నట్లు తెలిపారు.