
- డ్రైనేజీ సిస్టం, వాటర్ ఔట్ ఫ్లో ఏర్పాట్లు లేక సమస్యలు
- చిన్నవానకే మునుగుతున్నా పట్టింపు కరువు
- ఫిర్యాదు చేసినా లైట్తీసుకుంటున్న ఆఫీసర్లు, లీడర్లు
- ఏటా పునరావాస కేంద్రాల బాట పడుతున్న ప్రజలు
హనుమకొండ, వెలుగు: వాన మబ్బు చేస్తే చాలు గ్రేటర్ వరంగల్ లోతట్టు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. చిన్నవాన పడినా వరద నీళ్లు కాలనీలను ముంచెత్తుతుండగా, ఇక భారీ వర్షాలు కురిస్తే జనాలు పునరావాస కేంద్రాల బాట పట్టాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఆయా కాలనీల్లో డ్రైనేజీలు సరిగా లేకపోవడం, ఉన్నవాటిని క్లీన్ చేయక పూడికతో నిండిపోవడం సమస్యగా మారగా, వరద బయటకు వెళ్లే మార్గం లేక జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతున్నా మాన్సూన్ యాక్షన్ ప్లాన్ చేపట్టి లోతట్టు ప్రాంతాలకు ముంపు ముప్పు లేకుండా చూడాల్సిన లీడర్లు, ఆఫీసర్లు లైట్ తీసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చిన్న వానకే పడినా మునకే..
నగరంలో కొద్దిపాటి వాన పడినా కొన్ని కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. వరద బయటకు వెళ్లేలా డ్రైనేజీ ఇంటర్ లింకింగ్ లేకపోవడంతో నీళ్లన్నీ కాలనీల్లోనే నిలుస్తున్నాయి. ఫలితంగా అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ ఎస్ఆర్నగర్, సాయి గణేశ్కాలనీ చుట్టు పక్కల ప్రాంతాలతోపాటు బ్యాంక్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, సీకేఎం కాలనీ రోడ్డు, లక్ష్మీనగర్, శివనగర్, చింతల్ ఏరియాతోపాటు హనుమకొండలో గోకుల్ నగర్, శ్రీనివాస కాలనీ, ఎస్ బీహెచ్ కాలనీ, గోపాలపూర్ విజయనగర కాలనీ, కాజీపేట బాపూజీ నగర్ తదితర ప్రాంతాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. కొద్దిపాటి వాన పడినా ఈ ప్రాంతాల్లోకి వరద చేరుతుండగా, నీళ్లు బయటకు వెళ్లే ఏర్పాట్లు లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.
నగరంలోని మెయిన్ రోడ్డు జంక్షన్లలో కూడా కొద్దిపాటి వానకే నీళ్లు జామ్అవుతున్నాయి. హనుమకొండలో గోపాలపూర్, వికాస్ నగర్ రోడ్డు, అలంకార్ జంక్షన్, ములుగు రోడ్డు జంక్షన్, కాకాజీ కాలనీ, హంటర్ రోడ్డు భద్రకాళి బండ్ రోడ్డు, సంతోషీమాతా టెంపుల్ లేన్ ఇలా నగరంలో 18 చోట్ల మెయిన్రోడ్లు కూడా ముంపునకు గురవుతుండటం గమనార్హం.
ముందస్తు చర్యలు కరువు..
వర్షాకాలానికి ముందే జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో మాన్సూన్ యాక్షన్ ప్లాన్ చేపట్టి ముంపు సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. గ్రేటర్పాలకులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. ప్రధాన నాలాల పూడికతీత మినహా లోతట్టు ప్రాంతాల సమస్యలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే లోతట్టు కాలనీల్లో డ్రైనేజీలు పూడికతో నిండిపోగా, వరద, మురుగునీళ్లు సాఫీగా బయటకు వెళ్లేందుకు ఏర్పాట్లు లేక కాలనీల్లో నీళ్లు నిలిచి ఉంటున్నాయి. స్థానికులు ఇప్పటికే ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతోపాటు ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. అయినా సమస్యను పట్టించుకోవడం లేదని లోతట్టు ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా డ్రైన్లు క్లీన్ చేయడంతోపాటు వాటర్ ఔట్ ఫ్లోకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రోడ్డు పూర్తికాక ముంపులో కాలనీలు..
వరంగల్ ఎస్ఆర్నగర్, సాయి గణేశ్కాలనీ, లక్ష్మీగణపతి కాలనీ, మధురానగర్, గరీబ్ నగర్ తదితర ప్రాంతాలు ఏటా ముంపు సమస్యను ఎదుర్కొంటుండగా, ఇక్కడ సమస్యను దూరం చేసేందుకు గతంలో లేబర్ కాలనీ నుంచి సీకేఎం కాలేజీ వరకు రూ.31.71 కోట్లతో స్మార్ట్ రోడ్డు నిర్మాణానికి 2021 ఏప్రిల్12న అప్పటి మంత్రులు, ఇతర నేతలు శంకుస్థాపన చేశారు. అప్పటి బీఆర్ఎస్ లీడర్ ఒకరు కాంట్రాక్ట్ పనులను దక్కించుకోగా, లేబర్ కాలనీ నుంచి ఏనుమాముల వరకు రోడ్డు నిర్మించారు. ఇరువైపులా వరద, మురుగు ప్రవాహం కోసం సిమెంట్ పైపులు తెచ్చి రోడ్డు మధ్యలో పెట్టారు. బిల్లులు రాని కారణంగా సదరు నేత పనులు ఆపేశారు.
దీంతో పైనుంచి వచ్చే వరద ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా లేబర్ కాలనీ నుంచి ఏనుమాముల వరకు దారి పొడవునా ఉన్న క్రిస్టియన్ కాలనీ, పరిమళ కాలనీ, గ్రీన్ సిటీ, గరీబ్ నగర్, మధురానగర్, ఎస్ఆర్ నగర్, సాయిగణేశ్ కాలనీ, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లోకి వరద చేరుతోంది. ఇక్కడి నుంచి బయటకు వెళ్లే మార్గం లేక నీళ్లన్నీ కాలనీలతో పాటు ఓపెన్ ప్లాట్లను ముంచెత్తుతున్నాయి. ఫలితంగా వేలాది కుటుంబాలు ఇబ్బందులు పడాల్సివస్తోంది.
పట్టించుకుంటలేరు..
కాలనీల్లో డ్రైన్లు మొత్తం పూడికతో నిండిపోయినయ్. వర్షం పడితే పైనుంచి వచ్చే నీళ్లన్నీ మా ఇండ్లలోకి వస్తున్నాయి. ఇదే విషయాన్ని కార్పొరేటర్లతో పాటు అధికారులకు కూడా ఫిర్యాదు చేశాం. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోంది. పాలకులు లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలి.
గంగుల రవికుమార్, సాయి గణేశ్ కాలనీ కాలనీలు మునుగుతున్నయ్..
చిన్న వాన పడినా మా కాలనీతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. రోజుల తరబడి నీళ్లు నిలిచి ఉండి, బయటకు వెళ్లాలన్నా ఇబ్బందులు పడాల్సివస్తోంది. ప్రతి ఏడాది సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. ఎవరూ పట్టించుకోవడం లేదు.
బూస మహేశ్, ఎస్ఆర్ నగర్