ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కరీంనగర్ టౌన్, వెలుగు: బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ కరీంనగర్ ఇన్​చార్జి, ఉప్పల్​ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ప్రభాకర్ మాట్లాడారు. టీఆర్ఎస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే,  కేంద్రం గ్రామాలకు అందిస్తున్న నిధుల గురించి, అభివృద్ధి గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పాలన్నారు. సమావేశంలో  మాజీ ఎమ్మెల్యే శోభ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంగోపాల్ రెడ్డి, శివరామకృష్ణయ్య, పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు.

మూడేళ్లుగా పింఛన్​కు దూరం

కోనరావుపేట, వెలుగు : అధికారుల నిర్లక్ష్యంతో ఓ దివ్యాంగురాలికి మూడేళ్లుగా పింఛన్​అందక తీవ్ర ఇబ్బంది పడుతోంది. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన దడిగే పుష్పలత దివ్యాంగురాలు. ఆమెకు 2014లో దివ్యాంగుల కోటాలో పింఛన్​మంజూరైంది. కానీ అధికారులు ఆమెకు బదులు ఆమె భర్త దడిగే రాజేశం వివరాలు నమోదు చేశారు. అయితే  2019లో రాజేశం మృతి చెందడంతో పుష్పలతకు పింఛన్ కట్ అయింది. దీంతో అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని పుష్పలత ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఎంపీడీఓ రామకృష్ణను వివరణ కోరగా బాధితురాలు పింఛన్​దరఖాస్తు చేసేటప్పుడు వివరాలు తప్పుగా నమోదయ్యాయని, పుష్పలత తన ఆధార్ కు బదులు తన భర్త రాజేశం వివరాలు ఇచ్చిందని, అందుకే రాజేశం మృతి చెందిన వెంటనే పింఛన్​కట్ అయిందననారు. మళ్లీ దరఖాస్తు సమర్పిస్తే డీఆర్డీఓకు  నివేదించి ఫించన్ వచ్చేలా కృషి చేస్తామని ఎంపీడీఓ పేర్కొన్నారు.

శివారు కాలనీలపై ప్రత్యేక దృష్టి: మంత్రి గంగుల కమలాకర్   

రూ.3.64 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

కరీంనగర్ టౌన్, వెలుగు: పట్టణంలోని శివారు కాలనీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, కరీంనగర్ ను అందమైన నగరంగా తీర్చిదిద్దుకుందామని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం స్థానిక 9,55,60వ డివిజన్లలో రూ.3.64 కోట్ల అభివద్ధి పనులను మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ వ్యాప్తంగా మట్టిరోడ్లు లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ సహకారంతో డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని, మార్చి2023లోపు డంపింగ్ యార్డు పూర్తిగా ప్రక్షాళన అవుతుందన్నారు. 9వ డివిజన్ పోచమ్మవాడ, గ్యాస్ గోదాం, ఆటోనగర్ తో పాటు ఫిల్టర్ బెడ్ ఏరియాలో ఇంటర్నల్ రోడ్స్, డ్రైనేజీ పనులను ప్రారంభించారు. మానేర్ రివర్, సస్పెన్షన్ బ్రిడ్జి పూర్తయితే కరీంనగర్​అద్భుత పర్యాటక కేంద్రంగా మారుతుందని మినిస్టర్ ​చెప్పారు. కార్యక్రమంలో కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.  

‘దళితులకు ఆర్‌‌అండ్‌‌ఆర్‌‌ ప్యాకేజీ ఇవ్వకుండా కుట్ర’

గోదావరిఖని, వెలుగు : సింగరేణి మేడిపల్లి ఓపెన్‌‌ కాస్ట్‌‌ ప్రాజెక్ట్‌‌ తో అంతర్గాం మండలం లింగాపూర్‌‌ దళితులు చాలా నష్టపోయారని, అయినా వారికి ఆర్‌‌అండ్‌‌ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా మేనేజ్‌‌మెంట్‌‌ కుట్ర చేస్తోందని బీజేపీ స్టేట్ లీడర్‌‌ కౌశిక హరి అన్నారు. ఆదివారం లింగాపూర్‌‌ దళిత కాలనీలో నిమ్మరాజుల రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమస్య పరిష్కారం కోసం ఇటీవల అఖిల పక్షం ఆధ్వర్యంలో కలెక్టర్‌‌ను కలిశామని, కలెక్టర్​సానుకూలంగా ఉన్నా, సింగరేణి ఆఫీసర్లు మాత్రం మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. ఆఫీసర్లు తమ ఆలోచన మార్చుకోకపోతే  ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పద్మ, మాజీ సర్పంచ్‌‌ శంకరయ్య, కుమార్, మోహన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

లైసెన్స్ ఫీజుల పెంపుపై పోరాడుతాం : మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు

సుల్తానాబాద్, వెలుగు: మున్సిపల్ అధికారులు ఇష్టానుసారంగా పెంచిన ట్రేడ్ లైసెన్స్ ఫీజులను తగ్గించే వరకు పోరాటం ఆపమని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ ఆర్యవైశ్య భవన్ లో ఆదివారం స్థానిక వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ శాఖ జారీ చేసిన 147జీఓను అతిక్రమించి సుల్తానాబాద్ మున్సిపల్ అధికారులు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు పెంచారని పేర్కొన్నారు.  ఫీజులు తగ్గించే వరకు డబ్బులు చెల్లించవద్దని, వ్యాపారులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. సుల్తానాబాద్ పై ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్నారని అన్నారు. సమావేశంలో నాయకులు మినుపాల ప్రకాశ్​రావు, వరప్రసాద్, అబ్బయ్య గౌడ్, సతీష్, కిషోర్, రాజయ్య, రఫీక్, రాజు, పన్నాల రాములు, రాజలింగం, వ్యాపార సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

కబ్జాలతో సంబంధం లేదు: బొమ్మకల్ సర్పంచ్ శ్రీనివాస్

కరీంనగర్ టౌన్, వెలుగు: భూ కబ్జాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే తనను అభాసులుపాలు చేస్తున్నారని బొమ్మకల్ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కరీంనగరంలోని ప్రెస్ భవన్ లో ఆయన మాట్లాడారు. భూకబ్జాలకు పాల్పడినట్లు తేలితే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. కొందరు వ్యక్తులు తనపై కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సర్వే నంబర్ 724డీలో ఒక్క ఇంచ్​భూమి కూడా లేదన్నారు. ప్రజలకు సాయం చేశానని, అన్యాయం మాత్రం చేయలేదని శ్రీనివాస్​వెల్లడించారు.

కరీంనగర్ ​కలెక్టర్ కర్ణన్

కరీంనగర్ టౌన్, వెలుగు: ఓటు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, -ఓటు నమోదు చేసుకోవడం అందరి బాధ్యత  అని కరీంనగర్​కలెక్టర్ కర్ణన్ అన్నారు. ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం కరీంనగర్ సిటీలోని కోతి రాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మనకొండూరు బాలుర, బాలికల ఉన్నత  పాఠశాలలలో  ఏర్పాటు చేసిన  పోలింగ్ బూత్ లను కలెక్టర్ కర్ణన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు నమోదులో 18ఏళ్లు  నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా తమ పేరును నమోదు చేసుకునేలా చూడాలని ఆదేశించారు. 17ఏళ్లు నిండిన వారు ఓటర్ల జాబితాలో ముందస్తు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ప్రియాంక, కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.