ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

హనుమకొండ సిటీ, వెలుగు: దత్త స్మరణతో అనఘష్టమి వ్రతాల నిర్వహణతో ఓరుగల్లు ఆధ్యాతిక శోభ సంతరించుకుంది. సుమారు 10వేల మంది భక్తులు తరలివచ్చి జగద్గురువుల సన్నిధిలో హనుమకొండ ఆర్ట్స్​ కాలేజీ మైదానంలో ప్రధాన అనఘష్టమి వ్రతాన్ని సామూహికంగా నిర్వహించారు. అవధూత దత్త పీఠం ఆధ్వర్యంలో  శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, అవధూత దత్త పీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్ధ స్వామి, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీలకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే సతీశ్, మేయర్ సుధారాణి, మంత్రి ఎర్రబెల్లి సతీమణి ఉషా దయాకర్ రావు,  అధికారులు స్వాగతం పలికారు. 

గుప్త నిధుల తవ్వకాల ముఠా అరెస్ట్

మహాముత్తారం, వెలుగు: జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పలు గ్రామాల్లో గుప్తనిధుల తవ్వకాలు జరుపుతున్న ముఠాను పక్కా సమాచారంతో శుక్రవారం అరెస్ట్ చేసినట్లు  ఎస్సై రమేశ్​ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మహాముత్తారం మండలం  మద్దిమడుగు గ్రామ సమీపంలోని ఇప్ప చెట్ల కింద కొంతమంది 
గుర్తు తెలియని వ్యక్తులు కొద్ది రోజులుగా రాత్రిపూట గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు.  

గ్రామస్థులు గురువారం పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు పక్కా సమాచారంతో  తవ్వకాలు జరుపుతున్న 9 మంది సభ్యులు గల ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. అరెస్టు అయినవారిలో  చెర్ప రామ్మూర్తి, చెర్ప పాపారావు, మడకం సంతోష్, అలం నారాయణ, సిద్దబోయిన బతుకయ్య, బొచ్చు హరిబాబు, బొచ్చు చిట్టిబాబు, గుట్టల గంగారాం, గోడే తిరుపతి, మడకం ఎర్మయ్య ఉన్నారు.

వీఆర్ఏల నిరసన

వర్ధన్నపేట, వెలుగు: జాబ్​చార్ట్​లో లేని పనులు చేయిస్తున్నారని శుక్రవారం వర్ధన్నపేట మండలంలో వీఆర్ఏలు డ్యూటీలు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ మేరకు తహసీల్దార్ రవిచంద్ర రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో వీఆర్ఏ సంగి నరేందర్ ఆర్అండ్​బీ గెస్ట్ హౌస్ లో నైట్ డ్యూటీకి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని, జాబ్ చార్ట్ లో లేని పని కేటాయించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వీఆర్ఏలు పేర్కొన్నారు. 

రఘునాథపల్లి , వెలుగు: కలెక్టర్, ఆర్డీవో ఆఫీసులలో నైట్ డ్యూటీలు వేయొద్దని వీఆర్ఏలు శుక్రవారం డ్యూటీలు బహిష్కరించారు.  ఈ మేరకు తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వీఆర్ఏ సంఘం మండల   అధ్యక్షుడు యాకుబ్, వీఆర్ఏ సంఘ నాయకులు పాల్గొన్నారు.  

కుష్ఠు నిర్మూలనకు కృషి చేయాలి

తొర్రూరు, వెలుగు: కుష్ఠు రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్ అన్నారు. ఈ నెల 6  నుంచి 22 వరకు చేపట్టిన ఎల్సీడీసీ  కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టిన ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఈ సర్వేలో తొర్రూరు డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 550 అనుమానిత కేసులను గుర్తించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ మురళీధర్, కుష్ఠు, ఎయిడ్స్ ప్రోగ్రాం ఆఫీసర్ బిందు, మలేరియా ప్రోగ్రాం ఆఫీసర్ సుధీర్ రెడ్డి, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్, డివిజన్ ఇంచార్జి వనాకర్ రెడ్డి పాల్గొన్నారు.

కేఎంసీలో యూత్​ ఫెస్టివల్​ ప్రారంభం 

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్​ కేఎంసీలో రాష్ట్ర  స్థాయి యూత్​ ఫెస్టివల్​ వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్​ నవీన్​ మిట్టల్, వరంగల్​ కాళోజీ హెల్త్​ యూనివర్సిటీ వీసీ డా.కరుణాకర్​రెడ్డి, కేఎంసీ ప్రిన్సిపాల్​ మోహన్​ దాస్​ వేడుకలను  ప్రారంభించారు. ఈ సందర్భంగా సాంకేతిక విద్యాశాఖ కమిషనర్​

మాట్లాడుతూ కేఎంసీలో యూత్​ ఫెస్టివల్​ 

వేడుకలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం వీసీ కరుణాకర్​రెడ్డి మాట్లాడుతూ వివిధ జిల్లాలకు చెందిన 21 యూనివర్సిటీల నుంచి మెడికల్​
స్టూడెంట్స్ ఫెస్టివల్​కు హాజరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో కేఎంసీ డాక్టర్లు రాంకుమార్​ రెడ్డి, ప్రభాకర్​ రెడ్డి, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

భూ కబ్జా చేశారని గౌడ కులస్తుల ఆందోళన

కమలాపూర్, వెలుగు: అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలతో ఓ ప్రైవేటు సంస్థ తమ భూమిని ఆక్రమించుకుని బెదిరిస్తోందని గౌడ కులస్తులు శుక్రవారం ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి.. కమలాపూర్​ మండలం అంబాల గ్రామంలో  గౌడ కుల సంఘానికి చెందిన 28 ఎకరాల 20 గుంటల భూమిని రెండేళ్ల కింద ఓ సంస్థకు అమ్మారు. అయితే మరో నాలుగు ఎకరాలకు డబ్బులు ఇవ్వకుండా ఆ సంస్థ యాజమాన్యం కబ్జా చేసి ప్లాట్లుగా చేసి నిర్మాణాలు చేపట్టిందని ఆరోపిస్తూ గౌడ కులస్తులు ఆందోళన చేపట్టారు. ఆ భూమిలో నిర్మించిన కాంపౌండ్​వాల్​ను కూల్చివేశారు. తమకు  ఉపాధినిచ్చే తాటి చెట్లను కూడా కూల్చేసి చదును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

బీఆర్ఎస్​కు రాజీనామా 

నల్లబెల్లి, వెలుగు:  నల్లబెల్లి మండలం గుండ్ల పహడ్​గ్రామంలో పలు కుటుంబాలు శుక్రవారం బీఆర్ఎస్​కు మూకుమ్మడి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి ఒంటెద్దు పోకడతోనే రాజీనామా చేసినట్లు పార్టీ గ్రామ అధ్యక్షుడు  బైరుపాక సుధాకర్ మీడియాకు తెలిపారు.  కార్యక్రమంలో నాయకులు భగీరథ రావు,  పడాల అనిల్, అధిరెడ్డి, రమేశ్, శ్రీధర్, వెంకన్న, కొమురెల్లి, యాదగిరి పాల్గొన్నారు  

సంక్షేమ పథకాల్లో మనమే బెస్ట్:​ వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్​

హసన్ పర్తి, వెలుగు: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. శుక్రవారం గ్రేటర్​లోని 1,66వ డివిజన్ల పరిధిలో రూ.1కోటి 5లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లకు ఎమ్మెల్యే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే  మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్లుగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. కార్యక్రమంలో లీడర్లు గురుమూర్తి  శివకుమార్, శ్రీధర్  పాల్గొన్నారు.