10 లక్షల కెమెరాలతో నిఘా

10 లక్షల కెమెరాలతో నిఘా
  • హై టెక్నాలజీతో కమాండ్​ కంట్రోల్​ సెంటర్​
  • రాష్ట్రంలో ఏమూలన ఏం జరిగినా క్షణాల్లో సెంటర్​కు సమాచారం 
  • ప్రారంభించిన సీఎం కేసీఆర్​
  • పోలీసులు ఇంకా ఉత్సాహంతో ముందుకు పోవాలని పిలుపు
  • హైదరాబాద్​లో నేరాలు చాలా తగ్గాయని వ్యాఖ్య

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రమంతా పోలీస్​ నిఘా నీడలోకి వచ్చింది. 10 లక్షల సీసీటీవీ కెమెరాల కనెక్టివిటీతో.. బెల్జియం, జర్మనీ వంటి దేశాల హై టెక్నాలజీతో రూపొందించిన ఇంటిగ్రేటెడ్​ కమాండ్​ కంట్రోల్​ సెంటర్​(ఐసీసీసీ)ను గురువారం సీఎం కేసీఆర్​ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగినా ఈ సెంటర్​కు క్షణాల్లో సమాచారం చేరుతుంది. క్రిమినల్స్‌‌ డేటా, ట్రాఫిక్‌‌ పరిస్థితులతోపాటు వర్షాలు, విపత్తులు సంభవించిన సమయాల్లో కమాండ్‌‌ కంట్రోల్‌‌ సెంటర్‌‌‌‌ నుంచే మానిటర్​ చేస్తారు. ఈ సేవలను పోలీసులే కాకుండా ప్రభుత్వంలోని వివిధ విభాగాలు కూడా ఉపయోగించుకోనున్నాయి. 

వర్చువల్​ టెక్నాలజీ ద్వారా సమాచారాన్ని షేర్​ చేసుకుంటాయి. సీఎం సహా ఏ అధికారి అయినా రాష్ట్రంలోని మూలమూలను ఐసీసీసీ నుంచి చూస్తూ తగిన అంచనాకు రావొచ్చు. అవసరమైన సూచనలు చేయొచ్చు. సెంటర్​లో పోలీస్​ బాస్​లతోపాటు ముఖ్యమంత్రికి, రాష్ట్ర హోంమంత్రికి  కూడా ప్రత్యేక చాంబర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్​ బంజారాహిల్స్‌‌‌‌ రోడ్‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌ 12లో ఈ ఇంటిగ్రేటెడ్‌‌‌‌ కమాండ్ అండ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ సెంటర్​ను నిర్మించారు. అద్భుతమైన నిర్మాణం పూర్తి కావడం చాలా సంతోషంగా ఉందని, కమాండ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ ద్వారా మరింత పటిష్టమైన పోలీసింగ్ నిర్వహించాలని సీఎం కేసీఆర్​ అన్నారు. ఐసీసీసీ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ..  సింగపూర్‌‌‌‌‌‌‌‌ తరహాలో రాష్ట్ర పోలీసింగ్‌‌‌‌ ఉండాలని, ఇంకా ఉత్సాహంతో పోలీసులు ముందుకు పోవాలని సూచించారు. నేరాల నియంత్రణలో కమాండ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రానికి మూల స్తంభంగా ఉంటుందన్నారు.  రాష్ట్ర పోలీసులు మరింత సంస్కారవంతంగా పనిచేయాలని సూచించారు. 
 

సైబర్​ క్రైమ్​ను నిర్మూలించాలి
ప్రపంచ భూతంగా మారిన సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైమ్‌‌‌‌, డ్రగ్స్‌‌‌‌ను రాష్ట్రంలో పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు సీఎం కేసీఆర్​ ఆదేశించారు. సింగపూర్‌‌‌‌ తరహాలో అర్ధరాత్రి సమయాల్లో కూడా ఆడవాళ్లు నిర్భయంగా తిరిగే పరిస్థితులు తీసుకురావాలన్నారు. హ్యూమన్ కమ్యూనిటీ ఉన్నంత కాలం పోలీసింగ్‌‌‌‌ నిరంతరంగా ఉంటుందని చెప్పారు. ఎంత పటిష్టమైన పోలీసింగ్‌‌‌‌ ఉంటే సమాజానికి అంత సేఫ్టీ, సెక్యూరిటీ ఉంటుందని అన్నారు. రెండేండ్ల కిందట్నే పూర్తి కావాల్సిన కమాండ్‌‌‌‌  కంట్రోల్‌‌‌‌ సెంటర్ కరోనా వల్ల ఆలస్యమైందని పేర్కొన్నారు. గత ఎనిమిదేండ్లుగా రాష్ట్రంలోని ఎలాంటి అశాంతికి తావు లేకుండా చేశామన్నారు. ‘‘ప్రస్తుతం సైబర్‌‌‌‌‌‌‌‌క్రైమ్‌‌‌‌ చాలా గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నది. సైబర్‌‌‌‌‌‌‌‌ క్రిమినల్స్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌లో ఉండరు... ఎక్కడో కూర్చుని ఇక్కడ నేరాలు చేస్తరు. ఇలాంటి నేరాల నియంత్రణ కోసం ఇంటర్నేషనల్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ తీసుకురావాలి. డీజీ,అడిషనల్ డీజీ స్థాయి అధికారులతో స్పెషలైజేషన్‌‌‌‌ టీమ్స్‌‌‌‌ ఏర్పాటు చేయాలి. సమాజానికి ప్రమాదకరంగా మారిన డ్రగ్స్‌‌‌‌ను అంతమొందించాలి. భవిష్యత్తు తరాలను నాశనం చేసే డ్రగ్స్‌‌‌‌ మహమ్మారి ఆటంబాంబు కంటే ప్రమాదకరం. అమెరికా తరహాలో పోలీసింగ్ నిర్వహించి డ్రగ్స్‌‌‌‌, నేరాలను పూర్తిగా కంట్రోల్ చేయాలి” అని సూచించారు.  
 

సింగపూర్‌‌‌‌ లాంటి పరిస్థితులు మన దగ్గర రావాలి
సింగపూర్ వెళ్లినప్పుడు తాను స్వయంగా అక్కడి పోలీస్ సిస్టమ్​ను చూశానని సీఎం కేసీఆర్​ చెప్పారు. తన సెక్రటరీ రాజశేఖర్‌‌‌‌రెడ్డి, ఓ మహిళా ఐఏఎస్ ఆఫీసర్‌‌తో కలిసి అక్కడి పోలీసింగ్ తెలుసుకున్నామన్నారు. ‘‘హైదరాబాద్‌‌ను సింగపూర్‌‌‌‌లా ఎలా మారుస్తారని అక్కడి పోలీస్ అధికారులు అడిగారు. సింగపూర్‌‌‌‌లో మహిళలు అర్ధరాత్రి కూడా నిర్భయంగా బయటకు వెళ్లి వాళ్ల వాళ్ల పనులు చేసుకుంటరని గర్వంగా చెప్పారు. మేం కూడా టెస్ట్​ చేసినం.. నా వెంట వచ్చిన ఐఏఎస్​ అమ్మాయిని, మా రాజశేఖర్​రెడ్డిని చెరో రోడ్డు మీద పక్కపక్కన పెట్టి పంపినం. చాలా సంతోషంగా ఆ అమ్మాయి అలా వెళ్లి హ్యాపీగా వచ్చేసింది. అట్లాంటి పరిస్థితులు మనదగ్గర కూడా రావాలె.  అనుకుంటే వస్తయి. రాకపోయే సమస్య లేదు” అని చెప్పారు. డీజీపీ మహేందర్‌‌‌‌ రెడ్డి సూచించిన విధంగా మొదట్లో కమాండ్​ కంట్రోల్​ సెంటర్​కు 24 ఫ్లోర్స్ అనుకున్నామని, వివిధ కారణాల వల్ల 20 ఫ్లోర్స్‌‌కి కుదించాల్సి వచ్చిందని సీఎం తెలిపారు. ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన కమాండ్‌‌ కంట్రోల్‌‌ సెంటర్‌‌‌‌ను రిటైర్డ్‌‌ డీజీపీలు, ఉన్నతాధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. ఇండియాలో కొన్ని సమస్యలు ఉన్నాయని, ఫిలాసిఫీలోకి వెళ్లబోనని సీఎం చెప్పారు. అన్ని ఏరియాలపై నిఘా: డీజీపీ
తెలంగాణకు ఓ మైలురాయిగా కమాండ్‌‌‌‌ అండ్ కంట్రోల్‌‌‌‌ సెంటర్  నిలుస్తున్నదని డీజీపీ మహేందర్​రెడ్డి అన్నారు. ఇలాంటి సెంటర్‌‌‌‌‌‌‌‌ దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పారు. ఆధునిక టెక్నాలజీకి హబ్‌‌‌‌గా కమాండ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశామని, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు సహా అన్ని ఏరియాలను కమాండ్ కంట్రోల్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ నిఘాలోకి తెచ్చామని తెలిపారు.  ఎలాంటి నేరం జరిగినా వెంటనే పసిగట్టే విధంగా టెక్నాలజీని సమకూర్చుకున్నామని ఆయన వివరించారు. 24 గంటల పాటు అన్ని ప్రభుత్వ విభాగాలతో కలిసి పనిచేస్తున్నామన్నారు. సీఎస్​ సోమేశ్​కుమార్​ మాట్లాడుతూ..  ‘కమాండ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌  సెంటర్​ మంచి ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నాం” అని తెలిపారు. 

రిటైర్​ అయ్యాక కూడా మహేందర్​రెడ్డి సేవలు వాడుకుంటం 
కమాండ్‌‌ కంట్రోల్‌‌ సెంటర్‌‌‌‌ కోసం డీజీపీ మహేందర్‌‌‌‌ రెడ్డి ఎంతగానో శ్రమించారని సీఎం కేసీఆర్​ కొనియాడారు. ‘‘మహేందర్​రెడ్డికి డిసెంబర్​లో రిటైర్మెంట్​ ఉంది. నేను నిర్మొహమాటంగా ఆయనతో ఒక విషయం చెప్పిన.. ‘మీ డ్రెస్​ మారుతుంది కానీ..  ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి మీ సేవలు కొనసాగాలి’ అని  కోరిన. దీన్ని మహేందర్​రెడ్డి మన్నిస్తారని ఆశిస్తున్న” అని అన్నారు. రిటైర్‌‌‌‌ అయిన ఏకే ఖాన్‌‌ మైనార్టీ వెల్ఫేర్‌‌‌‌ కోసం కృషి చేస్తున్నారని, మహేందర్​రెడ్డి సేవలు కూడా అలా అవసరమని చెప్పారు.