
- గ్రేటర్లో 3 లక్షల కమర్షియల్ బిల్డింగ్స్
- చాలాచోట్ల రెసిడెన్షియల్బిల్డింగ్స్లో షాపులు, గోడౌన్లు
- ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుండా తప్పించుకునేందుకు నిర్వాహకుల ప్రయత్నాలు
- ఫిర్యాదులు వస్తున్నా చర్యలు తీసుకోని బల్దియా అధికారులు
హైదరాబాద్, వెలుగు:గ్రేటర్ పరిధిలోని కమర్షియల్ బిల్డింగ్స్ నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడంపై బల్దియా అధికారులు దృష్టి పెట్టడం లేదు. దీన్ని అలుసుగా తీసుకుంటోన్న నిర్వాహకులు రెసిడెన్షియల్ బిల్డింగ్స్‌లో కమర్షియల్యాక్టివిటీస్ చేస్తున్నారు. ట్యాక్స్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బల్దియా ఆదాయానికి గండి కొడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 3 లక్షల కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నప్పటికీ.. క్షేత్ర స్థాయిలో అంతకు డబుల్ ఉన్నట్లు తెలుస్తోంది. కాలనీలు మొదలు పెద్ద పెద్ద మార్కెట్ల వరకు రెసిడెన్షియల్పర్పస్అంటూ పర్మిషన్లు తీసుకుని తర్వాత బిజినెస్ ల కోసం వాడుతున్నారు. వీటిపై పలువురు బల్దియాకు ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. జగదీశ్ మార్కెట్ వంటి రద్దీ ఏరియాలో రెసిడెన్షియల్ పర్మిషన్లతో బిల్డింగ్స్ నిర్మించి తర్వాత కమర్షియల్‌గా మార్చుకుంటున్నారు. షాప్‌ల నిర్వాహకుల నుంచి లక్షల్లో అద్దెలు తీసుకుంటూ బల్దియాకు కట్టాల్సిన కమర్షియల్ ట్యాక్స్ నుంచి తప్పించుకుంటున్నారు. బేగంబజార్, చార్మినార్, సికింద్రాబాద్ ఇలా ఎక్కడ చూసినా ఇలాంటి బిల్డింగ్సే ఎక్కువగా ఉన్నాయి.
వాటి కంటే తక్కువగా ట్రేడ్ లైసెన్సులు
షాపులు, గోడౌన్లు, థియేటర్లు ఇలా 21 రకాల వ్యాపార, వాణిజ్య కేంద్రాల కోసం నిర్మించే భవనాల నుంచి బల్దియా కమర్షియల్ ట్యాక్స్ వసూలు చేస్తోంది. అయితే బిల్డింగ్స్నిర్మాణం తర్వాత అక్కడ ఏ బిజినెస్ చేస్తున్నారో.. దాని ఆధారంగా ట్రేడ్ లైసెన్స్‌లు జారీ చేయాలి. కానీ సిటీ వ్యాప్తంగా ట్రేడ్ లైసెన్స్‌లు 2 లక్షల లోపు మాత్రమే ఉన్నాయి. వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరూ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలనే నిబంధనలు ఉన్నా చాలా మంది తీసుకోవడం లేదు. అప్లయ్ చేసుకున్న వారికి ట్రేడ్ లైసెన్స్ ఇచ్చి వదిలేస్తున్నారు. లైసెన్స్ లేకుండా రన్అవుతున్న వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో అటు ప్రాపర్టీ ట్యాక్స్, ఇటు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు బల్దియాకు రాకుండా పోతున్నాయి. ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాల టైంలో అన్నింటిపై ఫోకస్ పెడతామని అధికారులు చెప్పినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
తప్పించుకునేందుకే ఇలా..
ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడంతోపాటు ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటే పార్కింగ్, ఫైర్ సేఫ్టీ అంటూ అధికారులు ఒత్తిడి తీసుకొస్తారనే ఎలాంటి అనుమతులు లేకుండా రెసిడెన్షియల్ భవనాల్లో వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఫలితంగా అటు జీహెచ్ఎంసీ ఆదాయాన్ని కోల్పోవడంతోపాటు ఏవైనా ప్రమాదాలు జరిగిన టైంలో జనానికి ఇబ్బంది తప్పడం లేదు. భవనాలను నిర్మించిన తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ కోసం అధికారులు ఇంటికి రాకముందే ట్యాక్స్‌లు చెల్లిస్తున్నారు. దీంతో ఈ భవనాల వైపు అధికారులు చూడటం లేదు. అధికారులు క్షేత్ర స్థాయిలో తిరిగి తనిఖీ చేస్తే కమర్షియల్ ట్యాక్స్ఎగ్గొడుతున్న వారు బయటపడే అవకాశం ఉంది.
మూడు శాఖలు కలిసి పని చేస్తేనే..
జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు, ఎలక్ట్రిసిటీ అధికారులు సమన్వయంతో పనిచేస్తే ఎక్కడ కమర్షియల్ భవనాలు ఉన్నాయన్న లెక్క పక్కాగా తేలుతుంది. ఎలక్ట్రిసిటీ, వాటర్ కనెక్షన్ కావాలంటే అధికారులు తప్పనిసరిగా ఇంటికి వచ్చి చెక్ చేసుకొని వెళ్తారు. వారు ఆ భవనం కమర్షియల్ పర్పసా లేక రెసిడెన్షియలా అన్నది పక్కాగా తెలుస్తోంది. అదే జీహెచ్ఎంసీ అధికారులు అయితే నిర్మించే సమయంలో మాత్రమే వెళ్తారు. ఆ తర్వాత పట్టించుకోరు.