
- నిరుడు మార్చిలో కమిషన్ ఏర్పాటు.. 14 నెలలు విచారణ
- అన్ని అంశాలతో 400 పేజీలకు పైగా రిపోర్ట్ రెడీ
- కేసీఆర్, హరీశ్ రావు బహిరంగ విచారణ లేనట్లే
- విజిలెన్స్ , ఎన్డీఎస్ఏ రిపోర్టులు కేవలం రిఫరెన్సులే
- కమిషన్ స్వతంత్రంగా దర్యాప్తు చేసిన వివరాలే కీలకం
- గత ప్రభుత్వ పెద్దల పాత్రను బయటపెట్టిన అధికారులు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ విచారణ దాదాపు పూర్తయింది. వచ్చే వారంలో కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ మేరకు విచారణ పూర్తి చేసిన కమిషన్.. దాదాపు 400 పేజీల రిపోర్ట్‌ను సిద్ధం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదనల దశ నుంచి మేడిగడ్డ కుంగుబాటు తర్వాత 2023 డిసెంబర్ వరకు జరిగిన ప్రతి అంశాన్ని రిపోర్ట్‌లో రికార్డు చేసినట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన నాటి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, ఈటల రాజేందర్‌కు సంబంధించి బహిరంగ విచారణ లేనట్లేనని అధికార వర్గాలు అంటున్నాయి.
వీరిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్‌కు కమిషన్ పిలుస్తుందని భావించినప్పటికీ.. లిఖితపూర్వకంగా వివరణ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇక రిపోర్ట్ లో విజిలెన్స్, ఎన్డీఎస్ఏ రిపోర్టులను కేవలం రిఫరెన్సులుగా మాత్రమే పరిగణించినట్లు సమాచారం. కమిషన్ స్వతంత్రంగా దర్యాప్తు చేసిన వివరాలే ఈ రిపోర్టులో కీలకంగా ఉండనున్నాయి. లక్ష కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో మొదటినుంచీ జరిగిన అన్ని విషయాలు రిపోర్ట్‌లో స్పష్టంగా పొందుపరిచినట్లు తెలిసింది.
2024 మార్చి 12న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 14 నెలల పాటు ఎంక్వైరీ కొనసాగింది. 6 సార్లు కమిషన్ గడువును సర్కారు పొడిగించింది. మొదట 100 రోజుల్లో (2024 జూన్ 20వరకు) రిపోర్ట్ ఇవ్వాలని గడువు విధించింది. ఇటీవల మరోసారి గడువును ఈ నెల 31 వరకు పొడిగించింది.
విచారణలో వెలుగుచూసిన కీలక విషయాలు ఇవే
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు, డ్రాయింగులు, బ్యారేజీల స్థలాల మార్పులో గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉన్నట్లు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్‌లో తేలింది. కొందరు ఇంజినీర్లు అభ్యంతరం చెప్పినా, ఒత్తిడి తెచ్చి మరీ ఫైళ్లను ఆమోదించుకున్నట్లు అధికారులు కమిషన్‌కు వెల్లడించారు. క్షేత్రస్థాయి ఇంజినీర్లకు ఒక విషయం చెప్పి, పైస్థాయి ఇంజినీర్లకు మరో విషయం చెప్పి గందరగోళం సృష్టించారని, తమకు నచ్చినట్లుగా బ్యారేజీల డిజైన్లు, డ్రాయింగులు, నిర్మాణ ప్రాంతాలను మార్చుకున్నారని కమిషన్ దృష్టికి తెచ్చారు.
ఇక పనులు పూర్తి కాకుండానే వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లు జారీ చేయడం, కొన్ని పనులు చేయకుండానే చేసినట్లు చూపడం, నిర్వహణ చేయాల్సిన బాధ్యత ఏజెన్సీకి ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం, బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకున్నా డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభమైందని సర్టిఫికెట్లు ఇవ్వడం, కరోనా సమయంలోనూ ఏజెన్సీకి బ్యాంక్ గ్యారంటీలు విడుదల చేయడం వంటి నిబంధనల ఉల్లంఘనలను కమిషన్ గుర్తించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ ను సీడబ్ల్యూసీలో దాఖలు చేసిన తర్వాత, అప్పటి ప్రభుత్వ ఆదేశాలతోనే మార్పులు చేశామని కమిషన్ కు మాజీ ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. బ్యారేజీల క్వాలిటీ కంట్రోల్ ను పట్టించుకోలేదని కూడా ఆయన చెప్పారు. డిజైన్ల ఆమోదంలో తనపై గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్న కేసీఆర్, మంత్రిగా ఉన్న హరీశ్ రావు ఒత్తిడి చేశారని కమిషన్ ముందు మాజీ ఈఎన్సీ (సీడీవో) నరేందర్ రెడ్డి చెప్పారు. డీపీఆర్ కు సీడబ్ల్యూసీ ఆమోదం తర్వాత కూడా మార్పులు చేశారని, ఇది కూడా గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే జరిగిందని అధికారులు పేర్కొన్నారు.
కమిషన్దృష్టికి భారీ అవకతవకలు
కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను అడ్డగోలుగా పెంచినట్లు కమిషన్ బహిరంగ విచారణలో అధికారులు వెల్లడించారు. ఎంక్వైరీలో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టును రూ.38,500 కోట్లతో నిర్మిస్తే 16 లక్షల ఎకరాలకు నీరందేదని, కానీ రీ-ఇంజినీరింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను రూ.1.47 లక్షల కోట్లకు పెంచినట్లు కమిషన్‌కు అధికారులు నివేదించారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని 2016లో రూ.1,853.31 కోట్లుగా అంచనా వేయగా, 2021 నాటికి అది రూ.4,321.44 కోట్లకు పెరిగిందని, లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కమిషన్ నిర్ధారించినట్లు తెలుస్తున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కంప్రోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) లేవనెత్తిన అంశాలు, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ రిపోర్టులను కూడా పరిశీలించింది. అయితే వాటిని రిఫరెన్స్ లుగానే తీసుకున్నట్లు తెలిసింది. బ్యారేజీలు, పంప్ హౌజ్ ల నిర్మాణంలోనూ భారీగా అవకతవకలు జరిగాయని కమిషన్ దృష్టికి వచ్చింది. పంప్‌హౌజ్ మోటర్లలో వేల కోట్ల రూపాయాల అవినీతి జరిగినట్లు కంప్లయింట్స్ అందాయి. అయితే, పంప్ హౌజ్ లకు సంబంధించి విచారణ కమిషన్ టర్మ్స్ అండ్ రిఫరెన్స్ (టీఓఆర్) లో పెట్టలేదు. దీంతో కమిషన్ వీటిపై విచారణ చేపట్టలేదు.