- అయినప్పటికీ నగర భవిష్యత్తే లక్ష్యంగా పనిచేస్తున్నం
- చట్టాలను గౌరవిస్తూ ప్రజల ఆస్తులు పరిరక్షిస్తున్నం
- హైడ్రాకు సపోర్ట్ ఇచ్చిన ప్రజలకు కమిషనర్ ధన్యవాదాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ధనదాహంతో ఇష్టానుసారంగా కబ్జాలు చేసి ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నవారు హైడ్రాపై దాదాపు 700 వరకు కేసులు పెట్టారని, వ్యక్తిగతంగా తనపై 31 వరకు కేసులు వేశారని కమిషనర్ ఏవీ రంగనాథ్తెలిపారు. అయినప్పటికీ భవిష్యత్తే లక్ష్యంగా చట్టాలను గౌరవిస్తూ ప్రజలు ఇచ్చిన స్ఫూర్తితో పర్యావరణాన్ని, ప్రజల ఆస్తులను పరిరక్షిస్తున్నామన్నారు. ఇటీవల హైడ్రాకు మద్దతుగా ర్యాలీలు చేసిన నగర ప్రజలకు శనివారం ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హైడ్రాపై దుష్ప్రచారాలను ర్యాలీలు, ప్రదర్శనల ద్వారా తిప్పికొట్టిన వారికి ధన్యవాదాలు చెప్పారు.
రూ. 55 వేల కోట్ల ఆస్తులను కాపాడాం
హైడ్రా ఏర్పడినప్పటి నుంచి 181 డ్రైవ్స్ నిర్వహించి 954 కబ్జాలను తొలగించినట్లు ఏవీ రంగనాథ్ తెలిపారు. మొత్తం 1,045.12 ఎకరాల భూమిని హైడ్రా కాపాడిందని, వీటి విలువ సుమారు రూ.50,000 కోట్ల నుంచి రూ.55,000 కోట్ల వరకు ఉంటుందన్నారు. ఇందులో ప్రభుత్వ భూములు 531.82 ఎకరాలు కాగా, రహదారుల కబ్జాలు 222.30 ఎకరాలు, చెరువుల కబ్జా 233.00 ఎకరాలు, పార్కుల కబ్జాలు 35 ఎకరాలు ఉన్నట్లు వివరించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ ఏడాది వరదలను చాలావరకు నియంత్రించామన్నారు. 56,330 క్యాచ్పిట్స్, 6,721 నాలాల క్లీనింగ్, 10,692 నీటి నిల్వ పాయింట్లు, 1,928 కల్వర్టులు క్లియర్ చేశామన్నారు. ఇతర పనులు 21,301 కలిసి మొత్తం 96,972 పనులు హైడ్రా ఈ వర్షాకాలంలో చేపట్టిందని పేర్కొన్నారు.
రూ. 58.40 కోట్లతో చెరువుల పునరుద్ధరణ...
రూ. 58.40 కోట్లతో మొదటివిడతగా చేపట్టిన 6 చెరువుల పునరుద్ధరణలో ఇప్పటికే బతుకమ్మకుంట పనులు పూర్తి చేశామని, మాదాపూర్ తమ్మిడికుంట, కూకట్‌పల్లి నల్ల చెరువు, పాతబస్తీలోని బమృక్ ఉద్దౌలా చెరువులు ఈ నెలాఖరుకు సిద్ధం చేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ వివరించారు. మాదాపూర్ సున్నం చెరువు, ఉప్పల్ నల్లచెరువు పునరుద్ధరణతో వరద ముప్పును తగ్గించామన్నారు. అంతేకాకుండా పైచెరువుల ఆక్రమణలను తొలగించి 105 ఎకరాల నుంచి 180 ఎకరాలకు పెంచామన్నారు. 75 ఎకరాల భూమి తిరిగి ప్రజలసొంతమయిందన్నారు. బతుకమ్మకుంట పునరుద్ధరణతో అక్కడ లోతట్టు ప్రాంతాలను, కూకట్‌పల్లి నల్లచెరువుతో చుట్టూ ఉన్న బస్తీలు, తమ్మిడికుంటతో శిల్పారామం ప్రధాన రహదారిపై వరద లేకుండా చేశామని కమిషనర్ తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని చెరువులు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో హైడ్రా పని చేస్తోందన్నారు.
