
- సీడ్ ప్యాకెట్ ధరను తగ్గించిన కంపెనీలు
- సీడ్ పంట సాగును 50 శాతానికి కుదింపు
గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో సీడ్ పత్తి సాగు చేస్తున్న రైతులను ఆయా కంపెనీలు, ఆర్గనైజర్లు దగా చేస్తున్నారు. సీడ్ ప్యాకెట్ ధరతో పాటు సీడ్ పత్తి సాగు చేసే ఏరియాను తగ్గించేశారు. కూలీల రేట్లు, ఫర్టిలైజర్, క్రిమిసంహారక మందులు, భూమి లీజ్ రేట్లు, సాగు ఖర్చులు ప్రతి ఏడాది పెరుగుతున్నా, సీడ్ విత్తనాల ప్యాకెట్ ధరను రూ.100 వరకు తగ్గించడం విస్మయానికి గురిచేస్తోంది. నిరుడు గద్వాల జిల్లాలో 60 వేల ఎకరాల్లో సీడ్ పంట సాగు చేసుకునేందుకు వివిధ కంపెనీలు రైతులకు ఫౌండేషన్ సీడ్ ను పంపిణీ చేయగా, ఈ ఏడాది దానిని 30 వేల ఎకరాలకు కుదించారు. ఇంత జరుగుతున్నా సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లను ప్రశ్నించే వారే కరువయ్యారు.
బాకీలు తీర్చేందుకే సీడ్ పంట సాగు..
కొందరు ఆర్గనైజర్లు తమ పొలాలను కుదువ పెట్టుకుని డబ్బులు ఇచ్చారని, వాటిని విడిపించుకునేందుకు రేటు తక్కువైనా తప్పనిసరి పరిస్థితుల్లో సీడ్ పంటను సాగు చేయాల్సిన పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. కంపెనీలు ఆర్గనైజర్ కు ఫౌండేషన్ సీడ్ ఇస్తాయి. వాటిని రైతులకు ఇచ్చి, పంట సాగు కోసం ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అడ్వాన్స్ గా చెల్లిస్తాడు. సీడ్ ఫెయిల్ అయితే అప్పు కింద రైతు పొలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేదంటే బాండ్ పేపర్‌పై రాయించకోవడం వంటివి చేస్తుంటారు. సంఘటనలుగా కోకోలలుగా ఉన్నాయి. ఇలా రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు.
ఎకరాకు రూ.80 వేల వరకు లాస్..
రైతులు సీడ్ లో జీఎంఎస్, కన్వెన్షన్ పద్ధతిలో సీడ్ పండిస్తున్నారు. జీఎంఎస్ పద్ధతిలో పండిస్తే ఎకరాకు 400 నుంచి 800 ప్యాకెట్ల వరకు దిగుబడి వస్తుంది. కన్వెన్షన్ పద్ధతిలో 400 నుంచి 1000 ప్యాకెట్ల వరకు దిగుబడి సాధిస్తారు. గత ఏడాది జీఎంఎస్ పద్ధతిలో పండించిన పంటకు ప్యాకెట్‌కు రూ.530 నుంచి రూ.550 వరకు చెల్లించారు. కన్వెన్షన్ పద్ధతిలో పండించిన సీడ్‌కు ప్యాకెట్‌కు రూ.600 నుంచి రూ.650 చెల్లించారు. నిరుడు కంటే ప్యాకెట్ కు రూ.80 నుంచి రూ.100 తగ్గిస్తే ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.80 వేల వరకు లాస్ వస్తదని రైతులు చెబుతున్నారు.
పుట్టగొడుగుల్లా సీడ్ కంపెనీలు..
నడిగడ్డలో క్వాలిటీ సీడ్ వస్తుందనే ఉద్దేశంతో చాలా కంపెనీలు ఇక్కడి ఆర్గనైజర్ల ద్వారా తమ ఫౌండేషన్ సీడ్ రైతులకు ఇచ్చి సీడ్ పత్తిని ఉత్పత్తి చేసుకుంటున్నాయి. వేద, రాశి, కావేరి, నూజివీడు, అంకూర్, జేకే, రాయల్, టాటా, కోహినూర్, సాయి భవ్య, వసంత, పాలమూరు, నాథ్, శ్రీరామ, గంగా కావేరి, యశోద, క్రిస్టల్, సూపర్, ఇండో అమెరికా, ధనలక్ష్మి, నంది వంటి పెద్ద కంపెనీలతో పాటు చిన్న కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. నిరుడు వివిధ కంపెనీలు పోటీపడి రైతులకు పెద్ద ఎత్తున సీడ్ ఇచ్చారు. కానీ, ఈ ఏడాది ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
కర్నాటకకు సీడ్ కంపెనీలు షిఫ్ట్..
జోగులాంబ గద్వాల జిల్లాలో సీడ్ బిజినెస్ అంతా ఆర్గనైజర్ల కనుసన్నల్లో కొనసాగుతోంది. సీడ్ ఆర్గనైజర్ల ఆగడాలు తట్టుకోలేక ఇప్పటికే కొన్ని సీడ్ కంపెనీలు కర్నాటకకు షిఫ్ట్ అయిపోయాయి. మరికొన్ని కంపెనీలు తమ ఏరియాను తగ్గించుకున్నాయి. తాము చెప్పినంత కమీషన్ ఇవ్వాలని, రైతులకు ఇవ్వాల్సిన ధరను తామే డిసైడ్ చేస్తామని, తాము చెప్పినట్లు వింటేనే ఇక్కడ కంపెనీ సీడ్ రైతులకు ఇస్తామంటూ తెగేసి చెబుతున్నారు. ఇలాంటి కారణాలతో పలు కంపెనీలు ఈ ఏడాది సీడ్ ఏరియా తగ్గించడానికి కారణమని చెబుతున్నారు.