సొంతంగా ఇన్సూరెన్స్ చేయించుకున్నందుకు రూ.64వేల పరిహారం

సొంతంగా ఇన్సూరెన్స్ చేయించుకున్నందుకు రూ.64వేల పరిహారం
  • ఆదిలాబాద్‌‌, నిర్మల్‌‌లో ఇట్లనే ఇన్సూరెన్స్ చేయించుకున్న
  • రైతులురాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేయని సర్కారు..
  • రైతులకు తీవ్ర నష్టం..  పంట నష్టంపై స్పందిస్తలే
  • కేంద్రానికి నివేదిక ఇవ్వని వ్యవసాయ శాఖ

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర సర్కారు ఫసల్ బీమా అమలు చేయడం లేదని.. ఓ రైతు తన పంటకు సొంతంగా ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు. ఇటీవలి వర్షాలకు పంట దెబ్బతిన్నా.. రూ.64 వేలను పరిహారం కింద అందుకున్నాడు. నిర్మల్‌‌ జిల్లాకు చెందిన గణపతిరెడ్డి.. తన ఎకరన్నర పొలంలో పత్తి సాగు చేశాడు. బ్యాంకులో లోన్‌‌ తీసుకునే సమయంలోనే సొంతంగా డబ్బులు కట్టి ఫసల్‌‌ బీమా చేసుకున్నాడు. జులై నెలలో వచ్చిన వర్షాలతో పత్తి పంట మొత్తం దెబ్బతిన్నది. బీమా కంపెనీని ఆశ్రయించి పరిహారం పొందాడు. ఇలా ఆదిలాబాద్‌‌, నిర్మల్‌‌ రైతులు సొంతంగా పంట బీమా చేసుకుని పరిహారం అందుకున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర సర్కారు పీఎం ఫసల్ బీమా అమలు చేయక లక్షలాది మంది రైతులకు సాయం అందలేదు. వానలకు పంట నష్టపోయినా పరిహారం దక్కలేదు. 

12 లక్షల ఎకరాల్లో నష్టం

ఈ వానాకాలం సీజన్‌‌లో భారీ వానలకు పంటలకు నష్టం జరిగినా వ్యవసాయ శాఖ పట్టించుకోలేదు. సుమారు 12 లక్షల ఎకరాల్లో పంట జరిగింది. ఆదిలాబాద్‌‌, నిర్మల్‌‌, నిజామాబాద్‌‌, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. దాదాపు రూ.1,500 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా తేలింది. అగ్రికల్చర్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ మాత్రం కేవలం లక్షన్నర ఎకరాల్లోనే పంట నష్టం జరిగిందని అంచనా వేసింది. కనీసం అదికూడా కేంద్రానికి నివేదిక రూపంలో ఇవ్వలేదు. అగ్రికల్చర్‌‌ అధికారులు తేల్చిన లెక్కల ప్రకారమైనా సరే.. ఎకరానికి రూ.40 వేల చొప్పున కనీసం రూ.600 కోట్లు రైతులకు అందేది.

మూడేండ్ల నుంచి ఇదే తీరు

రాష్ట్రంలో మూడేండ్ల నుంచి వానలకు పంట నష్టం జరుగుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన నుంచి బయటకు వచ్చిన రాష్ట్రం.. ఇంతవరకూ బీమా పాలసీని ప్రకటించలేదు. పశ్చిమ బెంగాల్‌‌ తరహా పంట బీమా అమలు చేస్తామని చెప్పినా.. చర్యలు చేపట్టలేదు. పరిహారం, ఇన్ పుట్ సబ్సిడీ అందక రైతులు నష్టాల్లో మునుగుతున్నారు. పంట నష్టంపై ప్రశ్నిస్తే ‘రైతుబంధు ఇస్తున్నాం’ అని చెప్పి చేతులెస్తోంది. సాక్షాత్తు సుప్రీం కోర్టు ప్రశ్నించినా ఇదే సమాధానం చెప్పడం గమనార్హం.