పోటాపోటీగా సాగుతున్న హైదరాబాద్ ఎమ్మెల్సీ కౌంటింగ్

పోటాపోటీగా సాగుతున్న హైదరాబాద్ ఎమ్మెల్సీ కౌంటింగ్

హైదరాబాద్‌లో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు ఏ అభ్యర్థికీ రాకపోవడంతో సెకండ్ ప్రయారిటీ ఓట్లు లెక్కిస్తున్నారు. తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తున్నారు. హైదరాబాద్ సెగ్మెంట్‌లో పోటీ చేసిన 93 మంది అభ్యర్థులలో ఇప్పటి వరకు 89 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి, బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు మధ్య గట్టి పోటీ కొనసాగుతోంది. గెలుపుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 1,68,521 ఓట్లను ఎవరైతే సాధిస్తారో వారిని విజేతగా ప్రకటిస్తారు.

ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లు కలిపి 1,19,619 ఓట్లతో ముందంజలో ఉన్నారు. వీటన్నింటితో కలిపి వాణిదేవికి 9,119 ఓట్ల ఆధిక్యం లభించింది. బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు 1,10,500 ఓట్లతో సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 59,648 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 36,726 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి ఎల్ రమణ, ఇండిపెండెంట్ అభ్యర్థి హర్షవర్ధన్ ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.