చైర్‌‌పర్సన్‌ పదవి ఎవరికో .. కామారెడ్డి మున్సిపాలిటీలో పోటాపోటీ  

చైర్‌‌పర్సన్‌ పదవి ఎవరికో .. కామారెడ్డి మున్సిపాలిటీలో పోటాపోటీ  

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మున్సిపల్‌ చైర్‌‌పర్సన్‌పై  పెట్టిన అవిశ్వాస  పరీక్షలో కాంగ్రెస్‌ నెగ్గగా..   చైర్‌‌పర్సన్‌ పదవి రేసు రసవత్తరంగా మారింది.   ప్రస్తుత చైర్‌‌పర్సన్‌ పదవి కోసం కాంగ్రెస్‌లోని ఇద్దరు కౌన్సిలర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.  ఈ ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్‌  పెద్దల ఆశీర్వాదం తమకే ఉందని ప్రకటించుకుంటున్నారు.  అయితే 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో  49 స్థానాలకు గాను  బీఆర్‌‌ఎస్‌ ​23,  కాంగ్రెస్​12,  బీజేపీ 8,  ఇండిపెండెంట్లు ఆరుగురు  గెలిచారు.  మెజార్టీ స్థానాలు గెలుచుకోవడం,  రాష్ట్రంలో అప్పుడు బీఆర్​ఎస్​ అధికారంలో ఉండటంతో ఇండిపెండెంట్​ కౌన్సిలర్లు  కూడా ఆ పార్టీలో చేరారు.  దీంతో చైర్‌‌పర్సన్‌గా నిట్టు జాహ్నవి, వైస్‌ చైర్‌‌ పర్సన్‌గా గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో మరో ఎనిమిది మంది కాంగ్రెస్‌ కౌన్సిలర్లు బీఆర్‌‌ఎస్‌లో చేరారు. 

మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో .. 

బీఆర్​ఎస్​ చైర్​పర్సన్ నిట్టు జాహ్నవిపై  అవిశ్వాసం  నెగ్గిన నేపథ్యంలో  కాంగ్రెస్​ పార్టీకి చెందిన కౌన్సిలర్లు  చైర్‌‌పర్సన్‌ పదవి కోసం పోటీ పడుతున్నారు. అవిశ్వాసం పెట్టేందుకు మొదటి నుంచి తీవ్రంగా ప్రయత్నించిన  వైస్​ చైర్​పర్సన్​ గడ్డం ఇందుప్రియ, కౌన్సిలర్​ ఉరుదొండ వనిత చైర్‌‌ పర్సన్‌ పదవి తమకే దక్కాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అవిశ్వాసం బలపరీక్షకు ముందు గోవా క్యాంపులో ఉన్నప్పుడు వీరిద్దరూ చైర్​పర్సన్​ పదవి కోసం కౌన్సిలర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు.

ఈ విషయం పార్టీ ముఖ్య నేతలకు తెలియడంతో  హైదరాబాద్​వచ్చిన తర్వాత కాంగ్రెస్​ కౌన్సిలర్లతో  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ  సమావేశమయ్యారు.  ముందు అవిశ్వాస పరీక్షలో నెగ్గిన తర్వాత చైర్​పర్సన్​ పదవి గురించి ఆలోచిద్దామని ఆయన వారికి సూచించారు.  ఆ తర్వాత సీఎం రేవంత్​రెడ్డిని కౌన్సిలర్లు కలిశారు.  చైర్‌‌పర్సన్‌ పదవి కోసం ఇద్దరు  కౌన్సిలర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో  ముఖ్య నేతలు నచ్చజెప్పి ఒకరికి చైర్‌‌పర్సన్‌, మరొకరికి వైస్​చైర్​పర్సన్​ పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.   

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే.. 

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో  స్టేట్​లో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రావటంతో  కామారెడ్డి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు మారాయి.   అసెంబ్లీ ఎన్నికల టైంలో  వైస్​ చైర్​పర్సన్​ గడ్డం ఇందుప్రియ,  కౌన్సిలర్లు ముగ్గురు కాంగ్రెస్​లో చేరారు.  ఫలితాల తర్వాత క్రమంగా బీఆర్​ఎస్​ నుంచి  కౌన్సిలర్ల చేరిక మరింత పెరిగింది.  దీంతో కాంగ్రెస్‌ కౌన్సిలర్ల బలం మొత్తం 27కు చేరింది.  మెజార్టీ  సంఖ్య ఉండటంతో   బీఆర్​ఎస్​ కు చెందిన చైర్‌‌పర్సన్‌పై అవిశ్వాసం పెట్టి విజయం సాధించారు.