మాజీ సీఎం కేసీఆర్​పై భద్రాద్రి పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు

మాజీ సీఎం కేసీఆర్​పై భద్రాద్రి పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం టౌన్ పోలీస్​స్టేషన్​లో సోమవారం మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్​రావుపై అసెంబ్లీ ఎన్నికల్లో భారత చైతన్య యువజన పార్టీ తరుపున పోటీ చేసిన పూనెం ప్రదీప్​కుమార్​ ఫిర్యాదు చేశారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి 2016లో రూ.100కోట్లు, 2022లో కరకట్టల నిర్మాణానికి, ఎత్తైన ప్రదేశంలో వరద బాధితులకు ఇళ్లు కట్టించేందుకు రూ.1000కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి మోసగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

2014లో జరిగిన గిరిజన సదస్సులో ప్రతీ పేద గిరిజన కుటుంబానికి 3 ఎకరాల భూమితో పాటు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఉద్యమ సమయంలో రాష్ట్రం ఏర్పడిన వెంటనే భద్రాచలంను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్​రావు కూడా హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. భద్రాచలం ప్రజలను అబద్దపు హామీలతో మోసగించిన కేసీఆర్, హరీశ్​రావుపై కేసు నమోదు చేయాలని సీఐ నాగరాజురెడ్డికి ఇచ్చిన ఫిర్యాదులో డిమాండ్​ చేశాడు.