అధికారులు ప్రొటోకాల్ పాటించరా?.. తహసీల్దార్​పై కలెక్టర్​కు ఫిర్యాదు  

అధికారులు ప్రొటోకాల్ పాటించరా?.. తహసీల్దార్​పై కలెక్టర్​కు ఫిర్యాదు  

 కరీంనగర్, వెలుగు :  జమ్మికుంట తహసీల్దార్ శుక్రవారం అర్ధరాత్రి కల్యాణలక్ష్మి చెక్కులు పంచారని.. తనకు, ఎంపీపీకి, సర్పంచ్ లకు, ఎంపీటీసీలకు చెప్పకుండా ప్రొటోకాల్ ఉల్లంఘించారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. తహసీల్దార్ పై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి శనివారం ఆయన ఫిర్యాదు చేశారు. లబ్ధిదారుల వద్ద తహసీల్దార్ డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గంలో అధికారులు ఎమ్మెల్యేగా ఉన్న తనకు గౌరవం ఇవ్వడం లేదని

తమకు తెలియకుండా ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. దొంగచాటుగా చెక్కులు పంపిణీ చేసిన తహసీల్దార్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల దగ్గర వసూలు చేస్తున్న డబ్బులు జిల్లా మంత్రులకు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. తులం బంగారం హామీ గురించి అడుగుతామనే తమను పిలవకుండా చెక్కులు ఇచ్చారని విమర్శించారు.  

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలానా?: బీజేపీ

బీఆర్ఎస్ సర్కార్ హయాంలో గత రెండేళ్లలో హుజురాబాద్ నియోజకవర్గంలో చేపట్టిన వివిధ స్కీమ్ లకు సంబంధించిన చెక్కుల పంపిణీ, అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నీ తానై నిర్వహించారని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అధికారులు అప్పటి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ఎలాంటి సమాచారం ఇచ్చేవారుకాదని, అప్పుడు గుర్తుకు రాని ప్రొటోకాల్ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా?  అని వారు ప్రశ్నిస్తున్నారు.