
- రూమర్స్ కంట్రోల్‌కు ప్రత్యేక వ్యవస్థ
- కమిషన్‌లో ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక రిక్రూట్మెంట్
హైదరాబాద్, వెలుగు: క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారం నేపథ్యంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)లో కీలక సంస్కరణలకు రంగం సిద్ధమవుతోంది. అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ ఆఫీసుతో సంబంధం లేకుండా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏమైనా డౌట్లు ఉంటే..కమిషన్ ఆఫీసుకు అభ్యర్థులు రాకుండా కట్టడి చేసేలా ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆన్ లైన్ లోనే ఫిర్యాదులను తీసుకొని.. అదే వేదిక ద్వారా వాటికి రిప్లై ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. కాల్ సెంటర్ విధానాన్ని సైతం ఎత్తేసే యోచనలో ఉన్నారు.
దీనికి సంబంధించి మూడు రోజుల కింద జరిగిన టీఎస్ పీఎస్సీ సమావేశంలోనే ప్రాథమిక నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిసింది. పరీక్షలపై భయాందోళనలు, పుకార్లు, అపోహలు సృష్టించే వారిపై కఠినంగా వ్యవహరించాలని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక సెల్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇలాంటి చర్యల్లో పాల్గొన్న వారిపై ఎవరైనా సమాచారమిస్తే రివార్డు ఇవ్వాలని యోచిస్తున్నారు. ఆఫీసులోకి సెల్ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లు అనుమతించొద్దని.. ప్రతి ఉద్యోగిపై ప్రత్యేక నిఘా పెట్టాలని నిర్ణయించారు. భవిష్యత్‌లో సాధ్యమైనంత వరకూ ఆన్లైన్లోనే పరీక్షలు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
సర్కారు నుంచి ఫ్రీడమ్ కోసం
టీఎస్ పీఎస్సీలో సంస్కరణలు తీసుకురావడంలో భాగంగా సర్కారు నుంచి కమిషన్ ఉన్నతాధికారులు ఫ్రీడమ్‌ను కోరుకుంటున్నారు. ఖాళీల భర్తీకి ప్రత్యేక రిక్రూట్మెంట్ చేపట్టాలని, కమిషన్‌కు సెపరేట్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను రూపొందించాలని సర్కారును కోరుతున్నారు. బిల్లులు ట్రెజరీల్లో ఆగకుండా గ్రీన్ చానల్ విధానాన్ని అమలు చేయాలని, ప్రత్యేక పరిస్థితుల్లో అడిషనల్ బడ్జెట్ ఇవ్వాలనే డిమాండ్లను సర్కారు ముందు ఉంచినట్టు తెలుస్తోంది. స్టాండింగ్ కౌన్సిల్ ను ఎంచుకునే స్వేచ్ఛ టీఎస్ పీఎస్సీకి ఉండాలని సర్కారుకు ప్రతిపాదించినట్టు సమాచారం. రాజస్థాన్, గుజరాత్, యూపీ, హర్యానా సహా పలు రాష్ట్రాల్లోని చట్టాలను అధ్యయనం చేశాక కొత్త చట్టాలను రూపొందించాలని కోరినట్లు తెలిసింది.