
కుత్భుల్లాపూర్‌లో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. కళాశాల మొదలై ఆరు నెలలు గడుస్తున్నా.. సబ్జెక్టులు బోధించేందుకు సరైన అధ్యాపకులు లేరని వారు ఆరోపించారు. తమకు సరైన మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని నిరసనకు దిగారు. పేరుకు మాత్రమే క్లాసులు జరుగుతున్నాయని... అధ్యాపకులు చెప్పే పాఠాలు అర్థం కావడం లేదని విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎదురు తిరిగిన విద్యార్థులను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. నెల రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయని.. క్లాసులే పూర్తి కాకుండా ఎగ్జామ్స్ ఎలా రాస్తామని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. తల్లిదండ్రులు వచ్చి అడిగితే టీసీ ఇస్తామని బెదిరిస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు.
విద్యార్థుల నిరసనకు ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ సంఘీభావం తెలిపారు. విద్యార్థులతో పాటు నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో అధ్యాపకులను నియమించాలని అన్నారు. అలాగే.. విద్యార్థులకు అదనంగా టెంపర్ వరీ క్లాస్ రూములు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఎన్ఎస్ యూఐ తరపున వారికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. వారం రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే.. పోరాటానికి దిగుతామని బల్మూరి వెంకట్ హెచ్చరించారు.
ఇదిలా ఉంటే.. కళాశాలలో స్వీపర్, అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. మిగతా టీచింగ్ స్టాఫ్ అంతా ఉన్నారని అధ్యాపకులు చెబుతున్నారు. అటెండర్ లేకపోవడంతో వారు చేసే పని కూడా తామే చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ముందు తమ సమస్యలు పరిష్కరిస్తే విద్యార్థులకు న్యాయం చేస్తామని వారు అంటున్నారు