బావుల్లేవ్.. భరోసా లేదు..సింగరేణి సంస్థ భవిష్యత్తుపై ఆందోళన..

బావుల్లేవ్.. భరోసా లేదు..సింగరేణి సంస్థ భవిష్యత్తుపై ఆందోళన..
  • పాత గనులు మూతపడ్తున్నా కొత్త గనుల్లేవ్
  • పరిస్థితి ఇలాగే ఉంటే 2042 నాటికి సగానికి పడిపోనున్న గనులు, ఉత్పత్తి 
  • గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాకంతోనే ఈ దుస్థితి
  • కేంద్రం వేసే గనుల వేలంలో పాల్గొనొద్దని నాడు నిర్ణయం 
  • ఇప్పటికైనా వేలంలో పాల్గొంటేనే కొత్త గనులతో సంస్థకు మనుగడ 
  • అందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర సర్కార్‌‌ను కోరుతున్న కార్మికులు, నేతలు


కోల్‌బెల్ట్, వెలుగు: తెలంగాణ కొంగుబంగారంగా భావించే సింగరేణి సంస్థ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతున్నది. గత పదేండ్లుగా కొత్త బొగ్గు బ్లాకుల కేటాయింపు లేకపోవడంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులరైజేషన్) సవరణ చట్టం–2015 ప్రకారం దేశంలోని బొగ్గు బ్లాకులన్నింటినీ వేలం ద్వారా కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నది. కానీ కేంద్రం వేసే వేలంలో సింగరేణి పాల్గొనకుండా గత బీఆర్ఎస్ సర్కార్ అడ్డుకోవడంతో గత పదేండ్లుగా సంస్థకు ఒక్క బొగ్గు బ్లాక్ కూడా దక్కలేదు. ఓవైపు పాత గనులు మూతపడ్తుండడం, మరోవైపు కొత్త గనులు లేకపోవడంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకమవుతున్నది. 

ప్రస్తుతం 42 బావుల ద్వారా ఏటా 72 మిలియన్​టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుండగా.. పరిస్థితి ఇలాగే ఉంటే 2042 నాటికి బావుల సంఖ్య19కి,  ఉత్పత్తి 39 మిలియన్​టన్నులకు పడిపోయే ప్రమాదం ఉన్నది. దీంతో కేంద్రం నిర్వహించే వేలంలో పాల్గొనేలా సింగరేణి సంస్థను కాంగ్రెస్ సర్కార్ అనుమతించాలనే డిమాండ్​ఊపందుకున్నది. ఏటా1‌‌‌‌‌‌‌‌00 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకోవాలని లక్ష్యం పెట్టుకున్న సింగరేణి సంస్థకు గత బీఆర్ఎస్​ సర్కార్ తీసుకున్న నిర్ణయం శాపంగా మారింది.

 నిజానికి  రాష్ట్రంలో ఉన్న బొగ్గు బ్లాకులన్నింటికీ గతంలో సింగరేణే పూర్తి హక్కుదారుగా ఉండేది.  పర్యావరణ అనుమతులతో పాటు కేంద్రం నుంచి ఒకట్రెండు పర్మిషన్లు తీసుకొని కొత్త గనులు ప్రారంభించేది. కానీ కేంద్రం తీసుకొచ్చిన ఎంఎండీఆర్ అమెండ్​మెంట్ యాక్ట్‌‌‌‌తో దేశంలో ఏ సంస్థ అయినా సరే వేలంలో పాల్గొనే కొత్త బొగ్గు గనులను దక్కించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సింగరేణి పరిధిలో ఉన్న శ్రావణపల్లి, సత్తుపల్లి–3, కోయగూడెం ఓసీపీ, కేకే–6 బొగ్గు బ్లాక్‌‌‌‌లను కేంద్రం వేలం లిస్టులో చేర్చింది. దీంతో ఈ నాలుగు బొగ్గు బ్లాకులను దక్కించుకోవడానికి సింగరేణి కూడా వేలంలో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో వేలంపాటలో సింగరేణి పాల్గొనేలా చూడాల్సిన గత బీఆర్ఎస్​ప్రభుత్వం.. ఎట్టి పరిస్థితుల్లో వేలంలో పాల్గొనవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 

పాత పద్ధతిలోనే గనులు కేటాయించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి కార్మిక సంఘాలు డిమాండ్​చేసినా కేంద్రం పట్టించుకోలేదు. వాస్తవానికి ఎంఎండీఆర్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కోలిండియా యాజమాన్యం, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకొని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, సెక్రటరీని కలిసి రిజర్వేషన్​విధానంలో బొగ్గు గనులను పొందారు. ఈ విధానంలో కోలిండియా ఏకంగా116 బ్లాకులను దక్కించుకుంది. కానీ గత ప్రభుత్వ పెద్దల మొండివైఖరితో ఎవరినీ సంప్రదించలేదు. 

వాస్తవానికి సింగరేణిలో కేంద్రానికి 49శాతం వాటా ఉంది. కానీ కేంద్రాన్ని లెక్కచేయకుండా, వాటాదారుల ఒప్పందాలను పట్టించుకోకుండా సమస్యను కాస్తా రాజకీయ వివాదంగా మార్చింది. నాటి సీఎం కేసీఆర్ వివిధ అంశాలపై పలుమార్లు ప్రధాని నరేంద్రమోదీని కలిసినప్పటికీ, సింగరేణికి బొగ్గు బ్లాకుల గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. దీంతో కొయగూడెం, సత్తుపల్లి3, కేకే6, శ్రావణపల్లి బొగ్గు బ్లాకులు సింగరేణికి దక్కకుండా పోయాయి. కీలకమైన తాడిచెర్ల గనిని సింగరేణికి అప్పగించే అవకాశం ఉన్నప్పటికీ ప్రైవేట్‌‌‌‌ కంపెనీకి కట్టబెట్టిన ఘనత గత బీఆర్ఎస్​సర్కార్‌‌‌‌‌‌‌‌కే దక్కింది. 

కొత్త బావులు వస్తేనే మనుగడ.. 

135 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న సింగరేణి 1920 డిసెంబర్ 23న ‘సింగరేణి లిమిటెడ్ కంపెనీ’గా మారింది. ప్రస్తుతం రాష్ట్రం 51 శాతం, కేంద్రం 49 శాతం వాటాలతో పబ్లిక్ సెక్టార్‌‌‌‌‌‌‌‌ కంపెనీగా ఉంది. 1990 దశకంలో రెండుసార్లు బీఐఎఫ్ఆర్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లి దాదాపు ఖాయిలా జాబితాలో పడి బయటకు వచ్చిన మొట్టమొదటి ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి ఒక్కటే. 1998 నుంచి సంస్థ లాభాల్లోకి వచ్చింది. 2001-–02 నుంచి కార్మికులకు లాభాల్లో బోనస్​చెల్లిస్తోంది. ప్రస్తుతం 42 అండర్​గ్రౌండ్, ఓపెన్​కాస్టు ప్రాజెక్టుల ద్వారా ఏటా 72 మిలియన్​టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుండగా.. దీన్ని 100 మిలియన్​టన్నులకు పెంచాలని సింగరేణి లక్ష్యంగా పెట్టుకుంది. 

కానీ గత11 ఏండ్లలో ఒడిశా రాష్ట్రంలోని నైనీ బ్లాక్ మినహా కొత్త గనులేవీ ప్రారంభించలేదు. దీనికితోడు కాలం చెల్లిన పాత గనులను ఒక్కొక్కటిగా మూసివేస్తుండడం, కొత్త గనులు లేకపోవడంతో సింగరేణి మనుగడపై ఆందోళన వ్యక్తమవుతున్నది. పరిస్థితి ఇలాగే ఉంటే 2042–-‌‌‌‌‌‌‌‌43 నాటికి బొగ్గు బావులు19కి, ఉత్పత్తి 39 మిలియన్​టన్నులకు పడిపోనుంది. కొత్త గనులు లేకపోవడంతో సింగరేణిలో రిక్రూట్‌‌‌‌మెంట్లు కూడా ఆగిపోయాయి. వాస్తవానికి 1991లో సింగరేణి వ్యాప్తంగా లక్షా16వేల మంది కార్మికులు, ఉద్యోగులు ఉండగా.. తెలంగాణ వచ్చే(2014) నాటికి ఈ సంఖ్య 61,778కి పడిపోయింది. అండర్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ మైన్స్​తగ్గడం, ఓసీపీలు, యాంత్రికీకరణ పెరగడం వల్లే ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ప్రస్తుతం సంస్థలో 41 వేల మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తుండగా.. ఈ సంఖ్య 35 వేలకు పడిపోయే ప్రమాదం ఏర్పడింది. 

వేలంలో దక్కించుకుంటే తక్కువ పన్ను.. 

 బొగ్గు బ్లాకుల కోసం కేంద్రం నిర్వహించే వేలంపాటలో పాల్గొనేందుకు సింగరేణికి అవకాశం ఇవ్వాలని ఇటీవల గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నేతలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనకపోవటం వల్ల అతి ముఖ్యమైన కోయగూడెం, సత్తుపల్లి గనులు ప్రైవేటు సంస్థలకు పోయాయని వాపోయారు. టెండర్ ప్రక్రియలో పాల్గొని ఆ నాలుగు గనులు దక్కించుకుంటే సింగరేణి ఏటా 30.87 కోట్ల టన్నుల బొగ్గు అదనంగా ఉత్పత్తి చేసేదని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

 అదీగాక వేలం ద్వారా బొగ్గు బ్లాక్ దక్కించుకుంటే కేవలం 18.5 శాతమే పన్ను చెల్లించాల్సి ఉంటుందని, అదే కేటాయింపుల ద్వారా దక్కించుకుంటే 28శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని.. ఈ రకంగా చూసినా వేలంపాటలో పాల్గొనడమే మంచిదని ఆయనకు వివరించారు. మరోవైపు కేంద్రం నిర్వహిస్తున్న వేలంలో సింగరేణి పాల్గొనేలా చూడాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇప్పటికే సీఎం రేవంత్​రెడ్డి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు.

మూతపడనున్న గనులు.. 

  •  2024-25లో జేకే-5ఓసీ, ఆర్జీ ఓసీ-1, ఎస్ఆర్పీ-1యూజీ, ఆర్కేపీ ఓసీపీ(ఫేజ్-1), 6ఏ యూజీమైన్, ఆర్కే-5, ఆర్కే-6, ఆర్కే-న్యూటెక్ యూజీ గనులు మూతపడనున్నాయి. దీంతో సుమారు 2.60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గనుంది.    
  • 2025-26లో భూపాలపల్లి ఏరియాలోని కేటికే-6 యూజీ మైన్ మూతపడనుంది. దీంతో సుమారు 0.30 మిలియన్ టన్నుల ఉత్పత్తి పడిపోతుంది. 
  • 2027-28లో కిష్టారం ఓసీపీ, పీకే ఓసీ, కోయగూడెం-2, ఆర్జీఓసీపీ-3 ఎక్స్టెన్షన్, ఖైరీగూరా, జీడీకే11, వీకేపీ, కేకే5, ఆర్కే7, ఇందారం1ఏ గనులు మూతపడనున్నాయి. వీటిని మూసివేస్తే సుమారు 28 మిలియన్ టన్నుల ఉత్పత్తి తగ్గుతుంది.     
  • 2032-33లో జీడీకే-5 ఓసీపీ, కేటీకేఓసీ-2, కేకే ఓసీపీ, జేకే ఓసీపీ, పీవీకే5, కేటీకే-8యూజీ, కాసీపేట యూజీ మైన్లు మూతపడనున్నాయి. దీంతో సుమారు 7.58 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి పడిపోతుంది.    
  • 2037-38లో రామగుండంఓసీపీ-3, ఎస్సార్సీ ఓసీపీ-2, గోలేటీ ఓసీపీ, ఎస్సార్పీ3,3ఏ యూజీమైన్ మూతపడనున్నాయి. వీటి వల్ల సింగరేణి 10.78మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి  కోల్పోతుంది.     
  • 2042-43లో మణుగూరు ఓసీపీ, ఇందారం ఓసీపీ, రామకృష్ణాపూర్ ఓసీపీ-2ఫేజ్, ఎంవీకే ఓసీపీ, ఆర్కే-5, ఆర్కే-6 ఓసీపీ, కేటీకే1అండ్1ఏ యూజీ గనులు బంద్​కానున్నాయి. వీటి ద్వారా సుమారు 8.94మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గుతుంది.

తాజా అంచనాల ప్రకారం 2042 నాటికి సింగరేణి పరిస్థితి ఇలా.. 

సంవత్సరం    యూజీలు    ఓసీపీలు    మొత్తం మైన్లు    ఉత్పత్తి (మి.ట)    కార్మికులు

2024-25                 22                20                          42                       72.01                   40,994
2025-26                 18                19                          37                       74.97                   40,136
2026-27                 17                21                          38                       79.68                    39,473
2027-28                 18                21                          39                       85.35                    39,132
2032-33                 13               17                           30                       58.59                     35,519
2037-38                 10               13                           23                       48.94                     36,342
2042-43                 09                10                          19                       39.03                      35,665