ఏడీపీతో 112 జిల్లాల్లో మార్పులు

ఏడీపీతో 112 జిల్లాల్లో మార్పులు
  • దేశవ్యాప్తంగా 112 జిల్లాల్లోని 25 కోట్ల మంది జీవితాలు మారిపోయినయ్
  •     ‘సంకల్ప్ సప్త’ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ/బిలాస్‌‌పూర్ : ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్(ఏడీపీ) దేశంలోని 112 జిల్లాల్లో మార్పులు తీసుకొచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆస్పిరేషనల్ బ్లాకులను అభివృద్ధి చేసే కార్యక్రమానికి ఇది ఆధారం కానుందని చెప్పారు. ఆస్పిరేషనల్ బ్లాకుల సక్సెస్‌‌ను రివ్యూ చేసేందుకు తాను వచ్చే ఏడాది మళ్లీ వస్తానని తెలిపారు. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అమలుకు సంబంధించి ‘సంకల్ప్ సప్త’ కార్యక్రమాన్ని శనివారం ఢిల్లీలోని భారత్‌‌ మండపంలో ప్రధాని ప్రారంభించారు. ఏడీపీతో దేశవ్యాప్తంగా 112 జిల్లాల్లోని 25 కోట్ల మంది జీవితాలు మారిపోయాయని చెప్పారు. ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్‌‌లు ఇప్పుడు ఇన్‌‌స్పిరేషనల్ జిల్లాలుగా మారిపోయాయని తెలిపారు. ఇలానే మరో ఏడాదిలో 500 ఆస్పిరేషనల్ బ్లాక్‌‌లలో కనీసం 100 వరకు ఇన్‌‌స్పిరేషనల్ బ్లాకులుగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సంబంధిత విభాగాల్లో వెనుకబడిన 100 బ్లాక్‌‌లను ఎంచుకుని.. వివిధ అంశాల్లో జాతీయ సగటు కంటే మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.

చాలా తక్కువ మందికే చాన్స్ వస్తది

‘‘నా మాదిరి ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడిపేందుకు చాలా తక్కువ మందికి మాత్రమే అవకాశం వస్తుంది. నా అనుభవంతో చెబుతున్నా.. కేవలం బడ్జెట్ మాత్రమే మార్పు తీసుకురాదు. వనరులను సరైన రీతిలో వినియోగించడం, ఒక్కచోటుకు చేరేలా చూసుకుంటే.. బ్లాకుల కోసం ఎలాంటి తాజా నిధులు రాకుండానే పని చేయవచ్చు” అని ప్రధాని మోదీ అన్నారు. వనరులను సమానంగా పంపిణీ చేసేందుకు ప్రాధాన్యమివ్వాలని అన్నారు.

ఆవుపేడ సేకరణలోనూ అవినీతే..

చత్తస్‌‌గఢ్‌‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతి స్కీమ్‌‌లో అవినీతి జరుగుతున్నదని ప్రధాని మోదీ ఆరోపించారు. బీజేపీ పరివర్తన యాత్ర ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘దళితులు, ఎస్టీలు, ఓబీసీలు ఎదగడాన్ని కాంగ్రెస్‌‌ భరించలేదు. ఓబీసీలను దూషిస్తుంది” అని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే పబ్లిక్ సర్వీస్ కమిషన్‌‌ స్కామ్‌‌ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పీఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద చేపట్టే రేషన్‌‌ పంపిణీలో అవినీతి చేసిందని మండిపడ్డారు. ఆఖరికి ఆవు పేడ సేకరణ స్కీమ్‌‌లోనూ అక్రమాలు చేసిందన్నారు.