వరంగల్, వెలుగు : వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్పార్క్రైతులకు పరిహారం విషయంలో హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో కోర్టు సిబ్బంది గురువారం వరంగల్ ఆర్‍డీఓ ఆస్తులను జప్తు చేశారు. కోర్టు ఉత్తర్వులు, బాధితుడు సముద్రాల యాకస్వామి కథనం ప్రకారం..కేసీఆర్ ప్రభుత్వం 2017లో గీసుగొండ మండలం శాయంపేట శివారులో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్పేరుతో రైతుల నుంచి1200 ఎకరాలను సేకరించింది. 2020లో మళ్లీ బాధితులు సముద్రాల యాకస్వామి, సముద్రాల వెన్నెలకు చెందిన 20 ఎకరాలను తీసుకుంది. 2016లో ఎకరానికి రూ.10 లక్షల చొప్పున మాత్రమే పరిహారం కట్టించగా.. 2020లో అదే ధరకు ఇవ్వడాన్ని రైతులు స్వామి, వెన్నెల ఒప్పుకోలేదు. నాలుగేండ్లలో భూముల రేట్లు రెండు, మూడింతలు పెరగడంతో డబుల్ ధర ఇవ్వాలని రెవెన్యూ ఆఫీసర్లను కోరారు. అధికారులు మాత్రం ఏమీ పట్టించుకోకుండా నోటీసులు ఇచ్చి భూములు తీసుకున్నారు.
దీంతో రైతులు హైకోర్టుకు వెళ్లగా పెరిగిన ధరలకు అనుగుణంగా 20 ఎకరాలకు అదనంగా రూ.2 కోట్ల 40 లక్షల 14 వేలు ఇవ్వాలని గతేడాది మే 9న ఆదేశాలిచ్చింది. అయినా అధికారులు పట్టించుకోలేదు. మరోమారు ఈ ఏడాది ఫిబ్రవరి 27న ఇచ్చిన ఆదేశాలను కూడా పెడచెవిన పెట్టారు. దీంతో సీరియస్అయిన హైకోర్టు వరంగల్ కలెక్టరేట్‍లోని ఆర్‍డీఓ ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది.
గురువారం ఉదయం హైకోర్టు అధికారులు హనుమకొండ కాళోజీ జంక్షన్‍లో ఉండే ఆర్డీవో ఆఫీసుకు వచ్చి ఉత్తర్వులను చూపించారు. దీంతో రెవెన్యూ అధికారులు హైకోర్ట్ నుంచి వచ్చిన ఆఫీసర్ల బృందాన్ని గడువు కోసం ఒప్పించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. హైకోర్టు ఆదేశాల మేరకు సిబ్బంది ఆర్డీఓ కారు, ఆఫీస్‍లోని కంప్యూటర్లు, ప్రింటర్లు, ఫర్నిచర్, ఏసీలు, కూలర్లు, ఇతర వస్తువులను జప్తు చేశారు.