స్కీమ్​లపై అంతా గందరగోళం..గృహలక్ష్మి ఒక్కోచోట ఒక్కో తీరు!

స్కీమ్​లపై అంతా  గందరగోళం..గృహలక్ష్మి ఒక్కోచోట ఒక్కో తీరు!
  • దేనికి ఎప్పుడు అప్లయ్​ చేసుకోవాల్నో.. ఎక్కడ  చేసుకోవాల్నో చెప్తలే
  • ఏ డాక్యుమెంట్లు పెట్టాల్నో కూడా చెప్పెటోళ్లు లేరు
  • రెండు, మూడు రోజులే గడువంటూ ఆగమాగం ప్రకటనలు
  • ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా అప్లికేషన్ల తీరు
  • గృహలక్ష్మి, రూ. లక్ష సాయం, దళితబంధు సహా అన్నిటిదీ ఇదే పరిస్థితి
  • పేపర్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న జనం

హైదరాబాద్, వెలుగు:  నాలుగున్నరేండ్లు నాన్చి నాన్చి ఎన్నికల వేళ రాష్ట్ర సర్కార్​ మొదలుపెట్టిన స్కీములపై గందరగోళం నెలకొంది. ఏ పథకానికి అప్లికేషన్ల ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో.. ఎప్పుడు ముగుస్తుందో కూడా ప్రజలకు తెలియడం లేదు. కనీసం అప్లికేషన్లు ఎక్కడ ఇయ్యాలి.. వాటిలో ఏఏ డాక్యుమెంట్లు పెట్టాలి.. అనే వివరాలను కూడా ఏ అధికారీ చెప్పడం లేదు. పైనుంచి వస్తున్న ఆదేశాలతో జిల్లా అధికారులు.. ఫలానా స్కీమ్​కు రెండు, మూడు రోజుల్లో గడువు ముగుస్తుందంటూ ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. దీంతో జనం ఆగమైతున్నారు. ఆధార్​, ఓటర్​ ఐడీ కార్డులు పట్టుకొని మీసేవా సెంటర్లు,  ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అర్హులందరూ అప్లయ్​ చేసుకోకుండా కావాలనే ప్రభుత్వం ఇట్ల చేస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. 

 

గృహలక్ష్మి స్కీమ్​కు అప్లికేషన్లు ఎప్పటి నుంచి తీసుకుంటారనే తేదీనే ప్రకటించలేదు. తీరా చూస్తే.. అప్లయ్​ చేసుకునేందుకు  ఈ నెల 10  చివరి తేదీ అని సోమవారం సాయంత్రం ప్రభుత్వం తెలిపింది. ఇంత తక్కువ టైమ్​లో  ఎట్ల అప్లయ్​ చేసుకోవాలని జనం ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు దళిత బంధు, బీసీలకు రూ. లక్ష ఆర్థిక సాయం, మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయం, నోటరీ ఆస్తుల రెగ్యులరైజేషన్​, వ్యవసాయ రుణమాఫీ వంటి వాటి విషయంలోనూ  కన్ఫ్యూజన్​ కొనసాగుతున్నది. 

దళితబంధు లిస్ట్​ ఉన్నట్టా? లేనట్టా?

రెండో విడత దళిత బంధు స్కీమ్​ను ప్రతి నియోజకవర్గంలో 1,100 మందికి అందిస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. అర్హుల ఎంపిక ప్రక్రియను సంబంధిత ఇన్​చార్జ్​ మంత్రి, నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కలెక్టర్లు సంప్రదించి చేస్తారని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతున్నది. నేరుగా ఎమ్మెల్యేలే లిస్టులు తయారు చేసి జిల్లా కలెక్టర్లకు పంపుతున్నారు. దీంతో అర్హులు అటు జిల్లా కలెక్టరేట్లకు వెళ్లాల్నో? లేక ఇటు ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరగాల్నో  తెలియక సఫర్​ అవుతున్నారు. కలెక్టర్ల దగ్గరకు పోతే.. ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాలంటున్నరు. ఎమ్మెల్యే దగ్గరకు పోతే.. పేరు, అడ్రస్​, ఆధార్​ కార్డు నెంబర్​, రేషన్ కార్డు నంబర్​ ఒక పేపర్​ మీద రాసిచ్చి పోవాలని చెప్తున్నరు. అట్ల రాసిచ్చి వస్తే.. తాము అప్లికేషన్​ పెట్టుకున్నట్టా? లేనట్టా? అనేది తెలియడం లేదు. తమ పేరు లిస్టులో ఉంటుందో లేదో తెలియక అర్హులు ఎదురుచూడాల్సి వస్తున్నది. ఇప్పటివరకు దళిత బంధు లిస్ట్​ రెడీ అయిందో లేదో కూడా ప్రకటన రావడం లేదు. అసలు లిస్టు ఏ స్టేజ్​లో  ఉందో కూడా బయటకు రావడం లేదు. ఒక పద్ధతి ప్రకారం అప్లికేషన్లు తీసుకోవాలనే నిబంధన లేకపోవడమే ఈ గందరగోళానికి కారణంగా మారింది.  

రూ.లక్ష సాయం అంతేనా! 

బీసీల్లోని చేతి వృత్తిదారులకు, మైనార్టీలకు రూ. లక్ష ఆర్థిక సాయం అమలు తీరు కూడా గందరగోళంగా మారింది. ఆర్థిక సాయం కోసం అప్లయ్​ చేసుకునేందుకు బీసీలకు గత నెలలో ప్రభుత్వం 15 రోజుల సమయం ఇచ్చింది. దీంతో  అప్లై చేసుకునేందుకు మీ సేవా, ఇంటర్​నెట్​ సెంటర్లకు బీసీలు క్యూలు కట్టారు. అదే సమయంలో క్యాస్ట్​, ఇన్​కం తప్పనిసరి చేయడంతో ఎమ్మార్వో ఆఫీసుల బాటపట్టారు. వేల మందికి ఒకేసారి క్యాస్ట్​, ఇన్​కం సర్టిఫికెట్లు ఇవ్వడం ఎమ్మార్వో ఆఫీసుల్లో కుదరలేదు. వీఆర్వోల వ్యవస్థ రద్దు చేయడం అప్పటికే ధరణి సమస్యలతో తహసీల్దార్​ ఆఫీసులు బిజీ బిజీగా ఉండటంతో రూ. లక్ష సాయం కోసం లక్షల మంది బీసీలు అప్లయ్​ చేసుకోలేకపోయారు. మళ్లీ గడువు తేదీని కూడా ప్రభుత్వం పెంచలేదు. అప్పటికే 5.20 లక్షల దరఖాస్తులు వచ్చాయి. నెలకు ఒకసారి నియోజకవర్గానికి 300 మందికి లిస్ట్​ పెట్టి సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఇంతవరకు ఒక్క నియోజకవర్గంలో కూడా 50 మందికి మించి ఇయ్యలేదు. కొన్నిచోట్ల ఆ లెక్క సింగిల్​ డిజిట్​ కూడా దాటలేదు. అప్లయ్​ చేసుకునోళ్లకు కూడా అప్రూవ్​ అయినదీ లేనిదీ తెలియడం లేదు.  ఇక మైనార్టీలకు రూ. లక్ష సాయం విషయంలోనూ తిప్పలు తప్పడం లేదు. 

గృహలక్ష్మి.. ఒక్కోచోట ఒక్కో తీరు!

సొంత జాగా ఉన్నోళ్లకు ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి స్కీమ్ అప్లికేషన్ల స్వీకరణ ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా నడుస్తున్నది. ఒక్కో దగ్గర ఒక్కో రకమైన డాక్యుమెంట్లు కావాలంటూ ఇష్టమొచ్చినట్లు నిబంధనలు పెడ్తున్నారు. పైగా ఈ స్కీమ్ కు అప్లయ్​ చేసుకునేందుకు టైమ్​ను కేవలం మూడు రోజులే ఇచ్చారు. అదీ మంగళ, బుధ, గురువారమే. తొలిరోజు మంగళవారం కొన్ని చోట్ల జిల్లా కేంద్రాల్లో, మరికొన్ని చోట్ల మున్నిపాలిటీల్లో మాత్రమే అప్లికేషన్​ కౌంటర్లు ఓపెన్ చేశారు. అసలు దరఖాస్తులు తీసుకుంటున్నారనే విషయమే ఇప్పటి వరకు జనాల్లోకి వెళ్లలేదు. అప్లయ్​ చేసుకోవడానికి ఇంకా బుధ, గురువారం మాత్రమే మిగిలి ఉండటంతో అర్హులంతా అప్లయ్​ చేసుకోగలుగుతారా.. అనేది సందేహంగా మారింది. 

గృహలక్ష్మి, దళితబంధుకు ఆన్​లైన్​లో నో!

పలు పథకాలకు ఆన్ లైన్​లో అప్లికేషన్లు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్నది. దళితబంధుకు ఇప్పటివరకు ఆన్​లైన్​ అప్లికేషన్ల సిస్టమే లేదు. గృహలక్ష్మి స్కీమ్​కు  కూడా ఆన్​లైన్​అప్లికేషన్ లేదు. ఈ స్కీమ్​కు మూడు రోజుల్లో గడువు ముగుస్తుందంటూ సోమవారం చెప్పి.. దరఖాస్తు నమూనా రిలీజ్  చేశారు. వాటిని ఎక్కడ తీసుకుంటారన్నది కూడా చెప్పలేదు. కొన్ని జిల్లాల్లో కలెక్టరేట్లలో గృహలక్ష్మి అప్లికేషన్ల కౌంటర్ ఏర్పాటు చేశారు. మీ సేవా సెంటర్లు, ఇంటర్​నెట్​ సెంటర్ల చుట్టూ తిరిగి జనం.. చివరికి కలెక్టరేట్​కు వెళ్తే.. అక్కడ భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. బీసీలకు రూ. లక్ష సాయానికి ఆన్​లైన్​లో అప్లయ్​ చేసుకునే చాన్స్​ ఇచ్చినప్పటికీ.. కొందరివే తీసుకున్నారు. అయితే.. ఆ అప్లికే షన్లు అప్రూవ్​ అయ్యాయా లేదా అనేది ఏ ఆఫీసరూ చెప్పడం లేదు. తమకు సాయం అందుతుందా లేదా అని అర్హులు ఎదురుచూడాల్సి వస్తున్నది.

టైమ్​ రెండో రోజులు.. అప్లయ్​ చేసుకునేదెట్ల?

గృహలక్ష్మి స్కీమ్​కు మిగిలిన టైమ్​ రెండు రోజులే. అదీ బుధవారం, గురువారమే. అయితే..ఇంత తక్కువ టైమ్​లో ఎట్ల అప్లయ్​ చేసుకోవాలని జనం ప్రశ్నిస్తున్నారు. జాగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు మహిళల పేరుపైనే ఉండాలనే నిబంధన విధించడం బాగానే ఉన్నప్పటికీ.. కుటుంబసభ్యుల పేర్ల నుంచి ఇప్పటికిప్పుడు ఇంట్లోని మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేయడం వ్యయ, ప్రయాసలతో కూడుకున్నదని అంటున్నారు.  గ్రామాల్లో రిజిస్ట్రేషన్ పేపర్లు లేని అబాదీ జాగలే అధికంగా ఉన్నాయి. వారసత్వంగా వచ్చిన ఇంటి స్థలాల్లో చాలా వరకు అన్నదమ్ములు తెల్లకాగితాలపై రాసుకుని పంచుకున్నవే ఉన్నాయి. ఇలాంటి వారు గృహలక్ష్మికి అప్లై చేసుకునే చాన్స్ లేకుండాపోయింది.  గత ఆరేడేండ్లలో పెండ్లయిన జంటలకు కొత్త రేషన్ కార్డులు రాలేదు. రేషన్ కార్డు లేని కారణంగా వీరికీ గృహలక్ష్మి స్కీమ్​ వర్తించే చాన్స్​ లేదు.  క్యాస్ట్, ఇన్ కమ్​ సర్టిఫికెట్లు తప్పనిసరిగా సబ్మిట్ చేయాలని ప్రకటించడంతో రెండు రోజుల్లో వాటిని పొందలేని చాలా మంది ఈ స్కీమ్ కు దూరం కానున్నారు.