బీఆర్ఎస్ లో  టికెట్లిచ్చేదెవరు..? ఎవరికి వారుగా అభ్యర్థుల ప్రకటన

బీఆర్ఎస్ లో  టికెట్లిచ్చేదెవరు..? ఎవరికి వారుగా అభ్యర్థుల ప్రకటన
  • పటాన్ చెరులో మహిపాల్ రెడ్డి పేరు ప్రకటించిన సీఎం
  • ఆర్మూర్ టికెట్ జీవన్ రెడ్డికేనన్న ఎమ్మెల్సీ కవిత
  • హుజూరాబాద్ లో కౌశిక్ పోటీ చేస్తాడన్న కేటీఆర్
  • 14 మంది సిట్టింగులకు టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం 

హైదరాబాద్: బీఆర్ఎస్ లో అసెంబ్లీ టికెట్లు ఎవరు ప్రకటిస్తారు..? సీఎం కేసీఆరా..? వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరా..? ఎమ్మెల్సీ కవితనా..? అనే గందరగోళం నెలకొంది. ఇటీవల పటాన్ చెరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి భూమిపూజ చేసిన ముఖ్యమంత్రి పటాన్ చెరు అభ్యర్థిగా మహిపాల్ రెడ్డిని మరో సారి దీవించాలని కోరారు. దీంతో ఆయన అనుచరులు హర్షధ్వానాలు చేశారు. ఈలలు, జిందాబాద్ నినాదాలతో సభాస్థలిని ఉర్రూతలూగించారు. ఇదే సెగ్మెంట్ నుంచి టికెట్ ఆశిస్తున్న చిట్కుల్ సర్పంచ్ నీలం మధుకు మంత్రి కేటీఆర్ భరోసా ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. ‘టెన్షన్ అక్కరలేదు’ అంటూ భుజం తట్టడం గమనార్హం.  కేసీఆర్ చెప్పిన మహిపాల్ రెడ్డికి టికెట్ వస్తుందా..? చిన్న సార్ హామీ ఇచ్చిన నీలం మధుకు బీఫాం ఇస్తారా..? అన్న గందరగోళం నెలకొంది. ఇదిలా ఉండగా ఇటీవల ఆర్మూర్ లో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ‘‘ఆర్మూర్ ఎమ్మేల్యే త‌మ్ముడు జీవ‌న్ రెడ్డి చాలా మంచి వాడు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జీవ‌న్ రెడ్డినిమరోసారి భారీ మెజారిటీతో గెలిపించండి. ఆర్మూర్ లో మా తమ్ముడు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పైన పోటీ చేయాలంటే మైసమ్మ ముందట మేకపోతు కట్టేసినట్టే ఉంటది. దేవ‌త‌కు బ‌లిచ్చే మేక పోతు మాదిరిగా ఆవుతుది వాళ్లపరిస్థితి. ఇతర పార్టీ వాళ్ళు ఆశలు వదిలేసుకుంటే మంచిది. ఎవరు పోటీ చేసినా గెలిచే అవకాశం లేదు. అందుకే పోటీ లేకుంటే బెస్ట్’అంటూ కవిత ఓ సలహా కూడా ఇచ్చారు. ఈ లెక్కన ఆర్మూర్ టికెట్ ను కవిత ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉండగా ఇటీవల హుజూరాబాద్ లో జరిగిన సభకు హాజరైన మంత్రి కేటీఆర్ హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేస్తాడని భారీ మెజార్టీతో దీవించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఈ సెగ్మెంట్లో ఈటల రాజేందర్ పై పోటీ చేసి ఓడిపోయిన టీఆర్ఎస్వీ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. గెల్లుకు కేసీఆర్ ఆశీస్సులున్నాయని ఆయన  అనుచరవర్గం ప్రచారం చేసుకుంటున్నది. దీంతో ఆ సెగ్మెంట్ లో ఎవరికి టికెట్ వస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. 

ALSO READ:త్వరలో 33 నియోనాటల్ అంబులెన్స్ లు.. నీలోఫర్ ఆసుపత్రిలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ప్రారంభం

14 మంది సిట్టింగులకు టికెట్లు

సిట్టింగులకే టికెట్లు ఇస్తామని మొదటి చెప్పిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తర్వాత మాటమార్చారు. తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అందరి చిట్టా తన వద్ద ఉందని, తోకలు కత్తిరిస్తానంటూ హెచ్చరించారు. ఎవరి తోకలు కత్తిరిస్తారోననే భయం సిట్టింగులను వెంటాడింది. అంతలోనే 30 మంది సిట్టింగులకు టికెట్ ఇవ్వరనే ప్రచారం జరిగింది. ఆ 30 మంది పేర్లు కూడా బయటికి వచ్చాయి. రెండు మూడురోజుల నుంచి 14 మంది సిట్టింగులకు టికెట్ కన్ఫర్మ్ అయ్యిందనే ప్రచారం మొదలైంది. కన్ఫర్మ్ అయినట్టు ప్రచారం జరుగుతున్న వాళ్లలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపేరు ఉందని సోషల్ మీడియాలో పోస్టు వెలసింది. ఆ పోస్టు కు ఎమ్మెల్యే గువ్వల ఏకంగా థ్యాంక్స్ కూడా చెప్పేశారు. ఈ 14 మందికి టికెట్లు కన్ఫర్మ్ అయినట్టేనా..? బీఫాంలు ఇచ్చే నాటికి పరిస్థితులు తారుమారవుతాయా..? అప్పుడు కొత్త ముఖాలు తెరమీదకు వస్తాయా..? అన్న టెన్షన్ బీఆర్ఎస్ సిట్టింగుల్లో నెలకొంది.